Breaking News

నిర్వీర్యమైన తెలుగు అకాడమీకి పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నాం… : మంత్రి ఆదిమూలపు సురేష్

-తెలుగుభాషా ఔన్నత్యాన్ని కాపాడుతూ సంస్కృతానికి గుర్తింపుకే తెలుగు సంస్కృత అకాడమీగా
మార్పు …
-న్యాయపోరాటం ద్వారా సుమారు రూ. 200 కోట్ల అకాడమీ ఆస్థులను కాపాడాం…
-తెలుగు భాషను అకాడమీని నిర్వీర్యం చేస్తున్నామన్న ఆరోపణలు అవాస్తవం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుభాషా ప్రాచుర్యానికి సంస్కరణలు పరిశోధనలు శిక్షణా తరగతులు ద్వారా పరిధిని పెంచుటతోపాటు అన్ని భాషలకు మూలమైన సంస్కృత భాషను కూడా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తెలుగు సంస్కృత భాషా అకాడమీని నెలకొల్పామని రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. తెలుగు సంస్కృత భాషా అకాడమీ ఏర్పాటు ఆవశ్యకత పై రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ తెలుగు సంస్కృత అకాడమి ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతితో కలిసి విజయవాడలోని ఆర్ అండ్ బి భవన సముదాయంలో బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు భాషా ఔన్నత్యానికి మరింత ప్రాచుర్యం కల్పించడంతోపాటు వివిధ భాషలకు మూలమైన సంస్కృత భాషను కూడా అభివృద్ధి చేయాలనే సదుద్దేశ్యంతో తెలుగు అకాడమిని ప్రభుత్వం తెలుగు సంస్కృత అకాడమిగా మార్చుతూ జి.ఓ.నెం. 31 ను విడుదల చేయడం జరిగిందన్నారు. తెలుగు సంస్కృత భాషా అకాడమి ఏర్పాటు పై రాష్ట్ర శాసనసభలో చర్చించి మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలపడం జరిగిందన్నారు. ఈవిషయంలో ప్రతిపక్షానికి చెందిన నాయకులతో పాటు ప్రముఖులుగా చెప్పుకుంటున్న కొందరు విమర్శలు చేయడం సరికాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో తెలుగు అకాడమిని పూర్తిగా నిర్వీర్యం చేసారన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన అనంతరం ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ఏనాడూ తెలంగాణా రాష్ట్రంతో కనీసం తెలుగు అకాడమి పై సంప్రదింపులు జరపలేదన్నారు. అకాడమి ఆస్థుల పై గానీ ఉద్యోగుల జీతభత్యాలు గురించి గానీ పట్టించుకున్న నాధుడే లేడన్నారు. అకాడమి ద్వారా పాఠ్యపుస్తకాల ముద్రణను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి కనీసం విద్యార్ధులకు సకాలంలో పాఠ్యపుస్తకాలను కూడా అందించలేని దుస్థితికి తీసుకువచ్చారన్నారు. అకాడమికి పూర్వవైభవం తీసుకురావాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారన్నారు. తెలంగాణా నుండి మన రాష్ట్రానికి తెలుగు అకాడమి ద్వారా రావాల్సిన స్థిర చరాస్థులపై న్యాయపోరాటం చేయాలని సూచించారన్నారు. దీనిలో భాగంగా హైకోర్టులో వ్యాజ్యం వేయగా విభజన చట్టప్రకారం 52 : 48 రేషియోలో అకాడమి ఆస్థులను పంపకాలు చేసుకోవాలని తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. దీనిపై తెలంగాణా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా అదే తీర్పును సుప్రీంకోర్టు కూడా వెలువరించడం జరిగిందన్నారు. తద్వారా మన రాష్ట్రానికి సుమారు రూ. 200 కోట్ల రూపాయలు స్థిర చరాస్థులను దక్కించుకోగలిగామన్నారు. దీనిపై ఇప్పటికే ఆంధ్రా తెలంగాణాకు చెందిన అకాడమిల అధికారులు సమావేశమై ఆస్థుల పంపకాల పై ఒక నిర్ణయానికి రావడం జరిగిందన్నారు. 1968 లోనే మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు హయాంలో తెలుగు అకాడమి ప్రారంభ మైందన్నారు. దానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు మరికొంత వెలుగులోకి తీసుకు వచ్చారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో తెలుగు అకాడమి స్థిరత్వాన్ని కోల్పోయిందన్నారు. భారతీయ భాషలకు మూలమైన సంస్కృత భాషను కూడా అభివృద్ధి చేసి తెలుగు భాషకు మరింత వన్నె తేవాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ విషయంలో వస్తున్న ఆరోపణలు అవాస్థవం అని ఇప్పటి కైనా ప్రభుత్వం తెలుగు సంస్కృత భాషల అభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించాలని మంత్రి తెలిపారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుతూ ఇంగ్లీష్ భోధనను కూడా ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. 40 లక్షలమంది విద్యార్ధులకు తెలుగు-ఇంగ్లీష్ నిఘంటవులను జగనన్న విద్యాదీవెన ద్వారా అందించామని మంత్రి వివరించారు. ఉన్నత విద్య సాంకేతిక విద్యలలో తెలుగుతో పాటు సంస్కృత పదజాలాలు ఉంటాయని వాటి మూలాలపై పట్టు సాధించేందుకే సంస్కృత భాషను కూడా అనుసంధానం చేశామని మంత్రి తెలిపారు.
తెలుగు సంస్కృత అకాడమి ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ తెలుగు సంస్కృత అకాడమిగా పేరుమార్చడంపట్ల తెలుగు భాషను నిర్వీర్యం చేసినవారు మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలుగు భాషలో హిందీ, పార్శీ, సంస్కృతం తదితర అనేక భాషలు అంతర్లీనం అయి ఉన్నాయన్నారు. సంస్కృత పదం వాడకుండా ఇతర భాషల్లో ఏఒక్క పదం కూడా మాట్లాడలేరన్నారు. గతంలో వ్రాసిన శాసనాలను పరిశీలిస్తే ఈ విషయం విదితమవుతుందని అప్పటినుండే తెలుగు భాషకు సంస్కృత భాషకు విడదీయలేని బంధం ఏర్పడిందన్నారు. సంస్కృత భాష వాడకుండా కేవలం అచ్చతెలుగులో ఎన్ని పుస్తకాలు ముద్రితమయ్యాయి? ఎంతమంది అచ్చ తెలుగు భాషలో మాట్లాడగలుగుతున్నారనేది ఇప్పుడు విమర్శిస్తున్న విమర్శకులు తెలపాలని ప్రశ్నిస్తున్నామన్నారు. అందుకే తెలుగుభాషతో మిళితమైన సంస్కృత భాషను కూడా అభివృద్ధి చేసి తెలుగు భాషకు మరింత వన్నె తేవాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశ్యమన్నారు. తెలుగు సంస్కృత అకాడమిని ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతిలో 4 అంతస్థుల భవనాన్ని కేటాయించినందుకు అకాడమి పక్షాన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అకాడమి ద్వారా ఈఏడాది ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలను ముద్రిస్తున్నామని రాబోయే సంవత్సరం నుండి అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను ముద్రించేందుకు చర్యలు తీసుకోబోతున్నామన్నారు. ఇందుకు త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేసి విధి విధానాలను ఖరారు చేయడంతోపాటు అవసరమైన నిధులు కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు అకాడమి ఛైర్ పర్సన్  లక్ష్మీపార్వతి వివరించారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *