Breaking News

జనవరి 2 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో జనవరి 2 నుంచి 12వ తేది వరకు స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో 35వ పుస్తక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు పుస్తక మహోత్సవ సమన్వయకర్త డి.విజయకుమార్‌ వెల్లడిరచారు. ఈ మేరకు విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ నందు మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు 35వ పుస్తక మహోత్సవ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో విజయకుమార్‌ మాట్లాడుతూ ఈ ఉత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన పుస్తక మహోత్సవాలకు ఆనాటి సీఎం చంద్రబాబు పూర్తి సహకారం అందించారన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహించిన పుస్తక మహోత్సవాలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సహకారం అందించినట్లు చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, పుస్తక ప్రియుడైన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌లు కూడా ఈ పుస్తక మహోత్సవానికి అందించనున్నట్లు వివరించారు. బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ అధ్యక్షుడు కె.లక్ష్మయ్య మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాదని, సాహిత్యం, కళా రంగాలు కూడా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. ఈ దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వం, పౌర సమాజం సహకారంతోనే పుస్తక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించగల్గుతున్నట్లు చెప్పారు. బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ కార్యదర్శి టి.మనోహర్‌ నాయుడు మాట్లాడుతూ 35వ పుస్తక మహోత్స ప్రాంగణానికి పిడికిటి రామ కోటేశ్వరరావు (సాహితీ నవజీవన్‌ బుక్‌ లింక్స్‌ మాజీ అధినేత), ప్రధాన సాహిత్య వేదికకు చెరుకూరి రామోజీరావు(ఈనాడు గ్రూపు సంస్థల మాజీ చైర్మన్‌), ప్రతిభా వేదికపై రతన్‌ టాటా ( టాటా గ్రూపు మాజీ చైర్మన్‌) పేర్లు పెట్టటం జరిగిందన్నారు. జనవరి 2వ తేది సాయంత్ర 5 గంటలకు పుస్తక ప్రదర్శన ప్రారంభం అవుతుందన్నారు. ప్రారంభోత్స సభ అనంతరం పిడికిటి రామకోటేశ్వరరావు, చెరుకూరి రామోజీరావు, రతన్‌ టాటా సంస్మరణ సభలు జరుగుతాయన్నారు. ఈసారి పుస్తక మహోత్సవంలో సాహిత్య కళారంగాలకు చెందిన ఆరుద్ర, దాశరధి కృష్ణమాచార్యులు, నాజర్‌ (బుర్రకథ పితామహుడు), నార్ల చిరంజీవి, ఆలూరి భైరాగి, ఎన్‌.నటరాజన్‌,(శారద), భానుమతి( రచయిత్రి, సినీనటి)ల శత జయంతి సభలు జరుగుతాయని చెప్పారు. జనవరి 6వ తేది సాయంత్రం 4 గంటలకు స్థానిక పీబీ సిద్ధార్థ కళాశాల నుంచి పుస్తక మహోత్సవ ప్రాంగణం వరకు పుస్తక ప్రియుల పాదయాత్ర జరుగుతుందన్నారు. ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ‘నాకు నచ్చిన పుస్తకం, నన్ను ప్రభావితం చేసిన పుస్తకం, నన్ను మార్చిన పుస్తకం అనే అంశంపై ఎవరైనా మాట్లాడవచ్చని, అందు కోసం ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ పుస్తక మహోత్సవంలో జాతీయ అంతర్జాతీయ, ప్రభుత్వ ప్రచురణ సంస్థలు, తెలుగు ప్రచురణల సంస్థలతో 200లకు పైగా స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సొసైటీ గౌరవాధ్యక్షుడు బెల్లం బాబ్జి మాట్లాడుతూ ఈ ఉత్సవంలో శ్రీశ్రీ మహాప్రస్థానం వెలువడి 75 సంవత్సరాలైన సందర్భంగా ‘గ్రాంథాలయాల పునర్వికాసానికి ఉద్యమిద్దాం అనే అంశంపై సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సాహిత్య కార్యక్రమాల సమన్వయ కర్త గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ పుస్తక మహోత్సవం నిర్వహణలో సొసైటీ తీసుకునే నిర్ణయాలకు తన వంత సహకారం అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు జేపీ జక్కంపూడి ప్రసాద్‌, సంయుక్త కార్యదర్శి కొండపల్లి రవి పాల్గొన్నారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *