Breaking News

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజలపై కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారం తగ్గించేవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం చేస్తూనే ఉంటుందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కరెంటు ఛార్జీల బాదుడుపై ధర్నా చౌక్ నందు చేపట్టిన వైఎస్సార్ సీపీ పోరుబాటకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తొలుత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేస్తూ.. అందరూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తదనంతరం డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి ర్యాలీగా బయలుదేరి వెళ్లి గాంధీనగర్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయం నందు ఏఈ వెంకటేశ్వరరావుకు మల్లాది విష్ణు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్ధాలు, మోసాలతో అధికారంలోకి రావడం, తీరా వచ్చాక ఇచ్చిన హామీలను విస్మరించడం చంద్రబాబుకు షరామామూలేనని విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని నమ్మించి.. చివరకు రైతులను నిలువునా వంచించారని గుర్తుచేశారు. మరలా ఇప్పుడు కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని నమ్మబలికి.. అధికారంలోకి వచ్చాక ఆర్నెళ్లలోనే రూ.15,485.36 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఓమాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోమాట చెప్పడం బాబుకి వెన్నతో పెట్టిన విద్య అని మల్లాది విష్ణు అన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచమని, అవసరమైతే తగ్గిస్తామని పైగా వినియోగదారులే విద్యుత్ అమ్ముకునేలా చేస్తానని ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు బాబు చెప్పిన మాటలన్నీ ఏమయ్యాయని ఈ సందర్భంగా ప్రశ్నించారు. చివరకు విజన్ డాక్యుమెంట్ లోనూ ఛార్జీలు తగ్గిస్తామని పొందుపరిచి.. ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ప్రజలపై భారాలు మోపడం, అప్పులు చేయడం బాబుకి కొత్తేమీ కాదన్నారు. గతంలోనూ కరెంట్ ఛార్జీలు తగ్గించమని అడిగిన అమాయకులపై బషీర్బాగ్ లో కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదని గుర్తుచేశారు.

మంత్రులు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు
కేబినెట్ మంత్రులందరూ మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతూ.. 24 గంటలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జపం చేస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఓ వైపు రూ. 15,485 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపుతూనే.. మరోవైపు నిస్సిగ్గుగా అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందని మొసలి కన్నీరు కార్చిన కూటమి నేతలందరూ.. ఆర్నెళ్ల కాలంలోనే రూ. లక్ష కోట్ల అప్పులు చేయడంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పైగా అమరావతి అభివృద్ధి పేరుతో రూ. వేల కోట్ల అప్పులు తీసుకువస్తూ.. చివరకు ఆ భారాన్ని ప్రజల నెత్తిన రుద్దుతున్నారని నిప్పులు చెరిగారు. మీ చేతగానితనం వల్ల అనతికాలంలోనే అన్ని వర్గాల ప్రజలు రోడ్డుపైకి వచ్చారని దుయ్యబట్టారు.

సెంట్రల్ పరిధిలో..
సెంట్రల్ నియోజకవర్గంలో కేటగిరి-1 విభాగంలో 1,27,325 మంది గృహ వినియోగదారులకు గాను ప్రతినెలా 21.80 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం జరుగుతోందని మల్లాది విష్ణు వెల్లడించారు. కేటగిరి-2 విభాగంలో 21,669 మంది వినియోగదారులకు గాను 7.73 మిలియన్ యూనిట్లు., కేటగిరి-3 విభాగంలో 322 మంది వినియోగదారులకు గాను 0.31 మిలియన్ యూనిట్లు., కేటగిరి-4 కి సంబంధించి 979 మంది వినియోగదారులకు గాను 0.88 మిలియన్ యూనిట్ల వాడకం జరుగుతోందన్నారు. మొత్తంగా 1,50,295 విద్యుత్ కనెక్షన్లకు గానూ ప్రతినెలా 30.73 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందని చెప్పారు. ఈ లెక్కన అదనపు వడ్డింపులతో కలిపి నియోజకవర్గ ప్రజలపై రూ. 200 కోట్ల భారం పడుతున్నట్లు మల్లాది విష్ణు వివరించారు. అద్దె గృహాలలో చాలీచాలని జీతాలతో కుటుంబాలు నడిపే వారికి ఈ విద్యుత్ ఛార్జీలు పెనుభారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదే గత వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్‌ సమర్ధ వినియోగంలో జాతీయ స్ధాయిలో అనేక అవార్డులు వచ్చాయని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. కానీ చంద్రబాబు వల్లే విద్యుత్ రంగం నాశనమైందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి పేదలపై ఛార్జీల భారాన్ని తగ్గించాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత కరెంటును పునరుద్ధరించాలన్నారు. లేనిపక్షంలో ప్రజలపక్షాన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు యరగొర్ల తిరుపతమ్మ శ్రీరాములు, అలంపూర్ విజయలక్ష్మి, ఇసరపు దేవీ రాజా రమేష్, కొండాయిగుంట మల్లీశ్వరి, జానారెడ్డి, నాయకులు కుక్కల రమేష్, ఉద్దంటి సురేష్, బంకా భాస్కర్, కురిటి శివ, గుండె సుందర్ పాల్, అలంపూర్ విజయ్, కంభం కొండలరావు, బందెల కిరణ్ రాజ్, పార్టీ శ్రేణులు, విద్యుత్ వినియోగదారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *