Breaking News

నూతనంగా వితంతువులకు పింఛన్లు మంజూరు – రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కీలక నిర్ణయం.
-స్పౌజ్‌ కేటగిరి కింద కొత్తగా 5,402 మందికి పింఛన్లు మంజూరు చేసిన ప్రభుత్వం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సరళీకృతం చేసిందని రాష్ట్ర సూక్ష్మ చిన్న, మద్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారిక సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరేడు నెలలకు ఒకసారి కొత్తగా పింఛన్లు మంజూరు చేసే ధోరణికి స్వస్తి పలికామని అన్నారు. ఇప్పటికే పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే వెంటనే భార్యకు ఏ నెలకు ఆ నెలే పింఛను ఇచ్చే విధానాన్ని అమలులోకి తెచ్చామని తెలిపారు. దీన్నే స్పౌజ్‌ క్యాటగిరీగా గుర్తిస్తూ పింఛను మంజూరు చేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత నెల నవంబరు 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్బంగా స్పౌజ్‌ క్యాటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పింఛను మంజూరు చేస్తామని ప్రకటించారని, ఈ నెల నుంచి పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు.

అందులో భాగంగా 5,402 మందికి కొత్తగా ఫించన్లు ఇస్తున్నామని తెలిపారు. నవంబరు 1వ తేదీ నుంచి డిసెంబరు 15వ తేదీ వరకు కొత్తగా 5,402 మందికి వితంతువు (ఇప్పటికే పింఛను తీసుకుంటున్న భర్త చనిపోయిన వారికి) క్యాటగిరీలో పింఛను మంజూరు చేశామన్నారు. వీరికి డిసెంబర్‌ 31వ తేదీన రూ.4 వేల చొప్పున పింఛను పంపిణీ చేయనున్నామని తెలిపారు. అలాగే గత మూడు నెలల వ్యవధిలో వివిధ రకాల కారణాలతో పింఛను తీసుకోని 50 వేల మందికి సైతం బకాయిలతో సహా అందించనున్నామని ఆయన అన్నారు. వీరికి రెండు, మూడు నెలల మొత్తాన్ని కలిపి ఒకేసారి డిసెంబరు 31వ తేదీన పంపిణీ చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ ప్రకటనలో తెలియజేశారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *