తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

-రైతులు అధైర్యపడవద్దు.. ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది: జిల్లా కలెక్టర్
-గుణదలలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన
-రైతులకు శాస్త్రవేత్తల కీలక సూచనలు, సలహాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
‘ఆర్నబ్’ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు విజయవాడ శివారు గుణదల ప్రాంతంలో (మధురానగర్ వెనుక భాగం) నేలకొరిగిన వరి పంట పొలాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ మాట్లాడుతూ.. తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో సమగ్రంగా అంచనా వేసి రైతులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పంట పొలాల్లో నిలిచిన మురుగునీటిని వెంటనే బయటకు తోడేలా తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం, ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. నేలకొరిగిన వరి పైరును కాపాడుకునేందుకు శాస్త్రవేత్తలు రైతులకు పలు సాంకేతిక సూచనలు చేశారు. గింజ మొలకెత్తకుండా, నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు పొలాల్లో 5% ఉప్పు నీటి ద్రావణాన్ని వెంటనే పిచికారీ చేయాలి. తెగుళ్లు, ఫంగల్ వ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు టిల్ట్ లేదా హెక్సాకోనాజోల్ వంటి మందులను పిచికారీ చేసుకోవాలి. నీటిలో పడిపోయిన వరి దుబ్బులను పైకి లేపి, నిలబెట్టి కట్టే ప్రయత్నం చేయడం ద్వారా గింజ రంగు మారకుండా, మరింత నష్టం వాటిల్లకుండా కాపాడుకోవచ్చని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో గరికపాడు కెవికె ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎ.సుబ్బిరామి రెడ్డి, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఎం.రవి కిషోర్, క్రాప్ ప్రొడక్షన్ ఎస్ఎంఎస్ డాక్టర్ పి ఎం శివప్రసాద్, ప్లాంట్ ప్రొడక్షన్ ఎస్ఎంఎస్ డాక్టర్ ఎన్.రాజశేఖర్, వ్యవసాయ శాఖ టెక్నికల్ ఏవో ఎస్.వాణి, గుణదల వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీలత, వి.వెంకటేశ్వర్లు, రెవెన్యూ అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.