అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముస్లింలు పవిత్రంగా నిర్వహించుకొనే మొహర్రం మానవాళికి దివ్య సందేశాన్ని అందిస్తుంది. త్యాగ నిరతికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం మానవతావాదాన్ని తెలియచేస్తుంది. ధర్మ పరిరక్షణ, శాంతియుత సమాజ స్థాపన కోసం మహ్మద్ ప్రవక్త మనుమడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన ప్రాణ త్యాగం నుంచి ప్రస్తుత సమాజం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రజలను కంటికి రెప్పలా కాపాడవలసిన రాజు యజీద్ ప్రజా కంటకునిగా మారడాన్ని ఇమామ్ హుస్సేన్ తీవ్రంగా నిరసించారు. కుటుంబంతో సహా తన అనుచరులతో పోరాడి ప్రాణాలను అర్పించారు. ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ సంతాపం తెలపడమే ఈ మొహర్రం సారాంశం. తెలుగు రాష్ట్రాలలో పీర్ల పండుగ పేరుతో జరుపుకునే ఈ సంతాపంలో హిందువులు కుడా పాల్గొనడం మత సామరస్యాన్ని తెలియచేస్తుంది. సమ సమాజం, ప్రజల సుఖసంతోషాల కోసం ప్రాణాలను పణంగాపెట్టి పోరాడారు హజ్రత్ ఇమామ్ హుస్సేన్. దుర్మార్గాలు, దౌర్జన్యాలపై రాజీలేని పోరాటం చేయాలనే సందేశాన్ని ఆయన జీవితం వెల్లడిస్తుంది. నీ కోసం, నీ కుటుంబం కోసమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం కూడా పాటుపడాలని తెలియచెప్పిన ఇమామ్ హుస్సేన్ జీవితం వర్తమాన సమాజానికి ఆదర్శప్రాయమని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ జనసేన కార్యాలయం నుండి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసారు.
Tags amaravathi
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …