టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి వేడుకలు

-దేశ ఐక్యత, సమగ్రతకు సర్దార్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయం – కె. బుచ్చి రామ్ ప్రసాద్

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త:
భారత ఉక్కు మనిషి, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కె. బుచ్చి రామ్ ప్రసాద్ గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ పర్చూరి అశోక్ బాబు గారు, శ్రీ మాల్యాద్రి గారు, శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు శ్రీ ఏ.వి. రమణ గారు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ (శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ) గారు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులందరూ సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కె. బుచ్చి రామ్ ప్రసాద్ గారు మాట్లాడుతూ, భారతదేశంలోని అనేక సంస్థానాలను ఏకం చేసి అఖండ భారతదేశ నిర్మాణానికి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఆయన చూపిన జాతీయ సమైక్యత, దేశభక్తి, అంకితభావం నేటి తరానికి ఆదర్శప్రాయమని తెలిపారు.

దేశ సమగ్రత, సమైక్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత అని, సర్దార్ పటేల్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఐక్య భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.