Breaking News

ఏపీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఫలితాలు విడుదల చేసిన విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

-80.62 శాతంతో 1,34,205 మంది ఇంజనీరింగ్ కోర్సులకు అర్హత
-పారదర్శకంగా పరీక్షల నిర్వహణ
-గురువారం నుండి ర్యాంకు కార్డుల డౌన్ లోడ్ చేసుకోవచ్చు
-14 వ తేదీన అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాల విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో 2021 సంవత్సరానికి నిర్వహించిన ‘ఏపీ ఈఏపీసెట్’ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం విజయవాడలో విడుదల చేశారు. ఆన్ లైన్ పద్ధతి లో నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 2,59,688 మంది ధరఖాస్తు చేసుకోగా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కు 1,75,868 మంది, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ స్ట్రీమ్ కు 83,102 మంది, ఇంజనీరింగ్ అగ్రి కల్చర్ కు 718 మంది ధరఖాస్తు చేశారన్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఫలితాలను మాత్రమే విడుదల చేశామని, ఈ నెల 14 వ తేదీన అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూర్తి పారదర్శకంగా ఇంజినీరింగ్‌ వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు 120 కేంద్రాలు, 15 సెషన్స్ లలో తెలంగాణ లో 3 సెంటర్ల లో ‘ఏపీ ఈఏపీసెట్’ పరీక్షలను కాకినాడ జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ నిర్వహించడం జరిగిందని మంత్రి వెల్లడించారు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షకు 1,66,460 మంది హాజరుకాగా 1,34,205 (80.62) మంది అర్హత సాధించారన్నారు. కోవిడ్ సోకడం వల్ల ప్రవేశ పరీక్షకు హాజరు కాని వారికి మరలా ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షకు హాజరైన 18,548 మంది ఎస్సీ విద్యార్ధులు, 3,455 మంది ఎస్టీ విద్యార్ధులు నూరు శాతం అర్హత సాధించారని తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ యూనివర్శిటీ రెండు నెలల రికార్డు సమయంలో పరీక్షలు నిర్వహించినందుకు వారిని మంత్రి అభినందించారు.
ఇంజనీరింగ్ లో టాప్ 10 ర్యాంకర్లు…
ఇంజనీరింగ్‌ విభాగంలో మొదటి ర్యాంకు అనంతపురం జిల్లా కొడిగిన హళ్లి కి చెందిన కోయి శ్రీ నిఖిల్‌ కు, శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన వరద మహంత నాయుడుకు 2 వ ర్యాంకు, వైఎస్సార్ జిల్లా రాజంపేటకు చెందిన దుగ్గినేని వెంకట తనీష్ కు, విజయనగరం జిల్లా కు చెందిన సగరం దివాకర్ సాయికి సంయుక్తంగా 4 వ ర్యాంకు, నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన నెల్లూరు మౌర్య రెడ్డికి 5 వ ర్యాంకు, ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన కకునూరి శషాంక్ రెడ్డికి 6 వ ర్యాంకు, విజయనగరం జిల్లా గంట్యాడకు చెందిన మిధాతన ప్రణయ్‌కు 7 వ ర్యాంకు, విజయవాడ అయ్యప్పనగర్ కు చెందిన సురవరపు హర్షవర్మకు 8వ ర్యాంకు, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సత్తి కార్తికేయ కు 9 వ ర్యాంకు, తిరుపతికి చెందిన ఓరుగంటి తేజో నివాస్ కు 10 వ ర్యాంకు సాధించినట్లు మంత్రి వెల్లడించారు. అగ్రి, ఫార్మా ఫలితాలు ఈ నెల 14 న ప్రకటిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, మెడిసిన్ తదితర కోర్సులకు గతంలో ఏపీ ఎంసెట్‌ పేరుతో ఎంట్రన్స్ నిర్వహించేవారని, అయితే మెడికల్‌ కోర్సుల ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్‌’ నిర్వహిస్తున్నందున, దీంతో మెడికల్‌ విభాగాన్ని ఎంసెట్‌ నుంచి మినహాయించామన్నారు. మెడికల్‌ను తొలగించడంతో ఏపీ ఎంసెట్‌ ను ఏపీ ఈఏపీసెట్‌ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)–2021 పేరుతో నిర్వహిస్తున్నామన్నారు.
గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా చేయడంతో చాలా మంది పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు బాధపడ్డారని, ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాంకేతిక విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, అర్హత సాధించిన పేద పిల్లలకు కూడా ప్రైవేట్ సంస్థల్లో 35 శాతం సీట్లు కేటాయించాలని క్యాబినెట్ లో ఆమోదించి ఆర్డినెన్స్ జారీ చేసిందన్నారు. ఈ కళాశాలలో చదివే విద్యార్ధులకు కూడా పూర్తి ఫీజురీయింబర్స్ మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే భిన్నంగా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన లను అమలు చేస్తూ, నేరుగా తల్లుల ఎకౌంట్ లోనే పూర్తి ఫీజురీయింబర్స్ మెంట్ ను జమ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన రూ. 2,000 కోట్లను కూడా జగనన్న ప్రభుత్వం చెల్లించిందన్నారు. తల్లుల ఖాతల్లో ఫీజు రీయింబర్స్ మెంట్ ను జమ చేయడంపై కోర్టు స్టే ఇచ్చిందని, అయితే తల్లి ఎకౌంట్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ జమ అవటం వల్ల వారు చాలా సంతోషంగా ఉన్నారని, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల దయాదాక్షిణ్యాల మీద కాకుండా, ఆయా కళాశాల బిల్డింగ్, ఎక్విప్ మెంట్, మౌలిక సౌకర్యాలు తదితరమైనవి సక్రమంగా ఉన్నాయో లేవో అనేది తల్లిదండ్రులు తెలుసుకుని కళాశాలల్లో చేర్పించే అవకాశం ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం మేరకు ఫీజు రీయింబర్స్ మెంట్ పొందిన వారు 89 శాతం మంది కళాశాలలకు తల్లిదండ్రులు ఫీజులు చెల్లించారని, దీనిని వివరంగా కోర్టుకు తెలియజేసి రెవ్యూ పిటిషన్ వేస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానంగా చెప్పారు.
గతంలో ప్రైవేట్ యూనివర్శిటీల్లో మేనేజ్ మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా సీట్లు పెట్టి మెరిట్ ను చూడకుండా, పారదర్శకత పాటించకుండా విద్యను బజారులో దొరికే వస్తువు అనే భావన కల్పించారని, విద్య పూర్తి వ్యాపార ధోరణితో నడిచిందన్నారు. ఈ ఏడాది నుండి 70 శాతం ‘ఏపీ ఈఏపీసెట్’ ద్వారా మిగిలిన 30 శాతంలో 15 శాతం ఎన్ఆర్ఐ కోటా క్రింద, మిగిలిన 15 శాతం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం లోకల్, నాన్ లోకల్ లో పూర్తి పారదర్శకంగా భర్తీ చేయటం జరగుతుందని తెలిపారు. ఇంటర్మీడియెట్ కు ఆన్ లైన్ పరీక్ష విధానం గత ఏడాది ప్రవేశపెట్టడం జరిగిందని, దీనివల్ల పేద విద్యార్ధులు తమకు కావలసిన కాలేజీలను ఎంపిక చేసుకునే అవకాశం కల్గిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు 79 శాతం కళాశాల్లో ప్రవేశాలు పొందారన్నారు. ఆన్ లైన్ ప్రవేశాలపై కోర్టు స్టే ఇస్తూ, తల్లిదండ్రలకు అవగాహన కల్పించి విసృత ప్రచారం కల్పించాలని కోర్టు సూచిందన్నారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో విద్యా సంవత్సరం వృధా కాకుండా విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్ధేశ్యమన్నారు.
ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ గతంలో ప్రారంభించిన ప్రైవేట్ యూనివర్శిటీలపై ఎటువంటి నియంత్రణ లేకుండా ఇస్టానుసారంగా విడచిపెట్టడంతో ఫీజులపై నియంత్రణ లేకుండా పోయిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పేద, మెరిట్ విద్యార్ధులకు రాయితీతో కూడిన ఫీజుతో నాణ్యమైన విద్య అందించేందుకు కార్పొరేట్ కళాశాలల్లో 35 శాతం సీట్లు అందించాలని ఆర్ఢినెన్స్ తీసుకొచ్చిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్ర విద్యార్ధులపై ఎంతో మమకారంతో కార్పొరేట్ విద్య వీరికి అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ కే. హేమచంద్రా రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సెట్స్ డాక్టర్ ఎం. సుధీర్ రెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ పోలా భాస్కర్, పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *