ఎన్నికల నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి..

– పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన వ్యయ పరిశీలకులు బి.విజ‌య్ కుమార్‌
– ప్రశాంతంగా, పారదర్శకంగా పోలింగ్ నిర్వహణకు సూచనలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నియ‌మ‌నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా నిర్వ‌హించ‌డంపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించిన‌ట్లు జిల్లా వ్య‌య ప‌రిశీల‌కులు బి.విజ‌య్ కుమార్ అన్నారు.
ఆదివారం విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌తో పాటు కొండ‌ప‌ల్లి, తిరువూరు, నందిగామ‌, జ‌గ్గ‌య్య‌పేట మున్సిపాలిటీల‌ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వ్య‌య ప‌రిశీల‌కులు విజ‌య్ కుమార్ క్షేత్ర‌స్థాయిలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. విజ‌య‌వాడ ప‌రిధిలోని బిష‌ప్ అజ‌ర‌య్య కళాశాల‌తో పాటు బీఎస్ఆర్‌కే మున్సిప‌ల్ ఉన్న‌త‌పాఠ‌శాలు, పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ క‌ళాశాల‌, ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ క‌ళాశాల‌, నిర్మ‌ల స్కూల్‌, కేబీసీ జెడ్‌పీ హైస్కూల్‌, ఎస్ఆర్ఆర్ ప్రాథ‌మిక పాఠ‌శాల‌, ఎన్ఎస్ఎం, విశ్వ‌భార‌తి (ప‌ట‌మ‌ట‌) త‌దిత‌ర విద్యాసంస్థ‌ల్లోని పోలింగ్ కేంద్రాల‌ను ప‌రిశీలించారు. పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న తీరును, ఎన్నికల విధుల నిర్వహణను పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణ, ఎన్నికల నియమావళి అమలు తీరును ప‌రిశీలించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా అధికారులకు తగిన సూచనలు చేశారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎన్నికల నిర్వహణను సజావుగా పూర్తి చేయాలని వ్య‌య ప‌రిశీల‌కులు విజ‌య్ కుమార్ సూచించారు.