స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌

– ఎన్నికల కమిషన్ నిబంధనల అమలుపై ప్ర‌త్యేక దృష్టి
– ఒత్తిళ్లు, ప్రలోభాలకు తావులేకుండా పోలింగ్ ప్ర‌క్రియ‌
– క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించిన జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత వాతావరణంలో పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు, నియమ నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తూ, ప్రతి ఓటరు ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల యంత్రాంగం సమన్వయంతో ప‌నిచేసింద‌న్నారు.
ఆదివారం విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌తో పాటు కొండ‌ప‌ల్లి, తిరువూరు, నందిగామ‌, జ‌గ్గ‌య్య‌పేట మున్సిపాలిటీల‌ ఎన్నిక‌ల నేప‌థ్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఉద‌యం నుంచి క‌లెక్ట‌రేట్‌లోని క‌మాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పోలింగ్ స‌ర‌ళిని ప‌రిశీలించారు. వివిధ ప్రాంతాల్లో పోలింగ్ కొనసాగుతున్న తీరును, పోలింగ్ కేంద్రాల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ ప్రక్రియలో ఎక్కడా అంతరాయం కలగకుండా, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ విజ‌య‌వాడ అర్బ‌న్ ప‌రిధిలోని కేబీఎన్ క‌ళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని ప‌రిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పించిన మౌలిక సదుపాయాలు, తాగునీరు, క్యూలైన్ల నిర్వహణ, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణ, ఎన్నికల నియమావళి అమలు తీరును ప‌రిశీలించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు తీసుకున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.