-విజయవాడ 55వ వార్డులో విజయవంతంగా ముగిసిన పోలింగ్
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ చొరవతో అప్రమత్తమైన యంత్రాంగం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 1వ తేదీ ఆదివారం ఉదయం 7.00 గంటలకు పట్టణ స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రారంభమై ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) పరిధిలోని 86 వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే 55వ వార్డుకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లలో ఎన్నికల గుర్తులు తారుమారైనట్లు గుర్తించారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ దృష్టికి వచ్చిన వెంటనే ఆయన తక్షణమే స్పందించి, సంబంధిత ఎన్నికల అధికారులను అప్రమత్తం చేశారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడేలా వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 55వ వార్డుకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను తిరిగి ముద్రించే ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టి, కొద్ది గంటల్లోనే పూర్తి చేశారు. అనంతరం సరిచేసిన బ్యాలెట్ పేపర్లతో 55వ వార్డులో పోలింగ్ ప్రక్రియను తిరిగి ప్రారంభించారు. పోలింగ్‌లో ఏర్పడిన అంతరాయాన్ని అధిగమించి, ఓటర్లందరికీ తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారు. ఈ మేరకు 55వ వార్డులో ఓటర్లు రాత్రి 7.30 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తూ చర్యలు తీసుకున్నారు.
సమస్యను గుర్తించిన వెంటనే జిల్లా కలెక్టర్ అప్రమత్తమై, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల తక్కువ సమయంలోనే బ్యాలెట్ పేపర్ల పునర్ముద్రణ పూర్తి చేసి పోలింగ్‌ను తిరిగి ప్రారంభించడం సాధ్యమైంది. దీంతో 55వ వార్డులో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది.
ఎన్నికల నిర్వహణలో తలెత్తిన సమస్యను సత్వరమే పరిష్కరించి, ఓటర్ల ఓటు హక్కుకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టడం ద్వారా జిల్లా ఎన్నికల యంత్రాంగం ఎన్నికల ప్రక్రియను సజావుగా కొనసాగించేందుకు కృషి చేసింది.
