అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
అర్నబ్ తుపాను ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలో దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాలతో పాటు మౌలిక సదుపాయాల నష్టాలను కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల బృందం ఆదివారం విస్తృతంగా పరిశీలించింది. ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో పర్యటించి నేలకొరిగిన వరి, అరటి, కొబ్బరి పంటలు, దెబ్బతిన్న రొయ్యల చెరువులు, మత్స్యకారుల బోట్లు, విద్యుత్ స్తంభాలు, రహదారులు, నివాస గృహాలను పరిశీలించింది. రైతులు, ఆక్వా రైతులు, మత్స్యకారులు, తుపాను బాధితులతో నేరుగా మాట్లాడి నష్టాల వివరాలు సేకరించింది. పంట నష్టాలను శాస్త్రీయంగా అంచనా వేయడంతో పాటు ఉపగ్రహ చిత్రాలు, రిమోట్ సెన్సింగ్ ద్వారా వివరాలు సేకరిస్తున్నట్లు బృందం తెలిపింది. జిల్లాలో జరిగిన వాస్తవ నష్టాలను సమగ్రంగా అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని వెల్లడించింది. ఈ పర్యటనలో కేంద్ర బృంద సభ్యురాలు, జలవనరుల మంత్రిత్వ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కొల్లు రేఖారాణి, ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.వి.ఎస్.పి. శర్మ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ అలోక్ జవహర్, కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారి ఎస్.కె. రాకేష్ కుమార్ సింగ్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తుపాను నష్టాలపై కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పిస్తాం
