తుఫాను ముప్పు వేళ యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలి…

-ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో ముంచుకొస్తున్న తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు పూర్తి సంసిద్ధతతో పనిచేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, వైద్య, విద్యుత్, ఇరిగేషన్ తదితర లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ కొండ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, పూరిళ్లులో నివసిస్తున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. క్యాంపుల్లో ఆశ్రయం పొందుతున్న వారికి నేటి రాత్రి నుంచే భోజనం, తాగునీరు, వసతి వంటి కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. గర్భిణులు ముఖ్యంగా ప్రసవానికి సమీపంలో ఉన్నవారు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులను ముందుగానే సమీప ఆరోగ్య కేంద్రాలు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. మండల కేంద్రాల్లో, కలెక్టరేట్‌లో 24/7 కాల్ సెంటర్లు, అత్యవసర స్పందన కేంద్రాలు నిరంతరం పనిచేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, వర్షం, చెట్లు కూలడం, ముంపు వంటి వివరాలపై ప్రతి గంటకూ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయాలన్నారు. ప్రతి మండలంలో ట్రాక్టర్లు, జేసీబీలు, టెంపోలు, రోప్‌లు, పవర్ సాస్, టార్చ్ లైట్లతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈదురు గాలుల వల్ల రహదారులపై చెట్లు విరిగిపడినా లేదా విద్యుత్ స్తంభాలు నేలకొరిగినా అరగంట వ్యవధిలోనే ట్రాఫిక్‌ను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పరిధిలోని మైనర్ ఇరిగేషన్ చెరువులు, ట్యాంకుల పరిస్థితిని ఇరిగేషన్, రెవెన్యూ బృందాలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. 100 శాతం నిండిన చెరువుల కట్టలు తెగిపోకుండా ఇసుక బస్తాలు సిద్ధం చేసుకోవాలన్నారు. అలాగే పూర్తిస్థాయిలో నిండని చెరువుల్లోకి వర్షపు నీరు చేరేలా ఇరిగేషన్ ఏఈ, డీఈలు చర్యలు చేపట్టి సుమారు 2 నుంచి 3 టీఎంసీల వరకు నీటిని ఒడిసిపట్టేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. తాగునీటి క్లోరినేషన్ నిరంతరం జరగాలన్నారు. డయేరియా, మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాలన్నారు.

రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉన్న మారుమూల గ్రామాలు, లంక గ్రామాల్లో రేషన్, నిత్యావసర సరుకుల నిల్వలు ముందస్తుగానే అందుబాటులో ఉండేలా పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల రక్షణే ప్రథమ కర్తవ్యంగా ప్రతి శాఖ సమన్వయంతో,
బాధ్యతాయుతంగా పనిచేసి నష్టం వాటిల్లకుండా చూడాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ స్పష్టం చేశారు.