రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం

-ఆంధ్రా లయోలా కళాశాలలో కౌంటింగ్‌కు విస్తృత ఏర్పాట్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు–2026 నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నవంబర్ 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది ఉదయం 6 గంటలకే విజయవాడలోని ఆంధ్రా లయోలా కళాశాలకు చేరుకుని విధుల్లో పాల్గొంటారు.

ముందుగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు తీసుకువచ్చి, ఎన్నికల నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ వేగవంతంగా నిర్వహించేందుకు తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా మూడు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు.

తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన వార్డుల ఓట్ల లెక్కింపు ఇండోర్ స్టేడియంలో, పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన వార్డుల ఓట్ల లెక్కింపు ఇంటర్మీడియట్ బ్లాక్‌లో, సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన వార్డుల ఓట్ల లెక్కింపు ఇంటర్మీడియట్ బ్లాక్‌కు ఎదురుగా ఉన్న మరో బ్లాక్‌లో నిర్వహించనున్నారు.

ప్రతి వార్డుకు మొత్తం 10 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఐదు టేబుళ్లపై వార్డు కౌన్సిలర్ అభ్యర్థులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, మరో ఐదు టేబుళ్లపై మేయర్ అభ్యర్థులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఒక్కో వార్డు ఫలితాన్ని ప్రకటించేందుకు రెండు రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియ అవసరమవుతుందని తెలిపారు.

మొదటి రెండు రౌండ్లలో 44 వార్డులకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం తదుపరి రెండు రౌండ్లలో మిగిలిన వార్డుల ఫలితాలను ప్రకటించనున్నారు. వార్డుల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మేయర్ అభ్యర్థులకు సంబంధించిన మిగిలిన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు.