-రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులతో ఏర్పాటు
-ప్రజల భద్రతే లక్ష్యంగా ముందస్తు అప్రమత్తత చర్యలు
– నీటిమట్టం, వరద ప్రవాహ పరిస్థితుల నిరంతర పరిశీలన
-బృందాలకు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ దిశానిర్దేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మురసు తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు, ఎగువ ప్రాంతాల నుంచి వెలగలేరు రెగ్యులేటర్‌కు భారీగా వరద నీరు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ప్రత్యేక ముందస్తు అప్రమత్తత చర్యలు చేపట్టారు. రెగ్యులేటర్ వద్ద నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని సమీప గ్రామాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులతో సంయుక్త పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మూడు రోజుల పాటు షిఫ్టుల వారీగా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు. ఎప్పటికప్పుడు రెగ్యులేటర్ వద్ద నీటిమట్టం, వరద నీటి ప్రవాహ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నీటిమట్టంలో పెరుగుదల, తగ్గుదలతో పాటు వరద ప్రవాహంలో చోటుచేసుకునే మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని స్పష్టం చేశారు. నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగినా, అసాధారణ రీతిలో వరద ప్రవాహం ఉన్నా వెంటనే తహసీల్దార్‌తో పాటు సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిమట్టాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం, నీటి విడుదలకు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని పర్యవేక్షణ బృందానికి అందించాలన్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ లోతట్టు ప్రాంతాలు, ముంపు ముప్పు ఉన్న గ్రామాల ప్రజలను అవసరమైన సందర్భాల్లో ముందుగానే అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పర్యవేక్షణ బృందం వెలగలేరు రెగ్యులేటర్ వద్దే అందుబాటులో ఉండి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని, తుపాను ప్రభావం దృష్ట్యా అత్యంత అప్రమత్తతతో విధులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
