-ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చా.. పనికిమాలిన పనులు చేయడానికి రాలేదు: యార్లగడ్డ
-స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సహకారంతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం : యార్లగడ్డ
-గన్నవరం డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం : యార్లగడ్డ
-గన్నవరం, కేసరపల్లి, బుద్ధవరం చెత్త సమస్య పరిష్కారానికి రూ.54 లక్షలతో చెత్త తరలింపు వాహనం కొనుగోలు చేశాం : యార్లగడ్డ
-జడ్పీటీసీ అభ్యర్థి చిగురుపాటి కుమారస్వామికి కమలం గుర్తుపై ఓటేసి గెలిపించండి : యార్లగడ్డ
-40 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న కుమారస్వామికి కూటమి తరఫున అవకాశం కల్పించాం : యార్లగడ్డ
-ఎమ్మెల్యే ఒక్కరితోనే అభివృద్ధి సాధ్యం కాదు.. ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా పనిచేయాలి : యార్లగడ్డ
-వ్యక్తిగత దూషణలకు దిగను.. సంస్కారంతో కూడిన రాజకీయాలే చేస్తా : యార్లగడ్డ
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, పనికిమాలిన పనులు చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం మండల జడ్పీటీసీ అభ్యర్థి చిగురుపాటి కుమారస్వామి, కూటమి ఎంపీటీసీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం సాయంత్రం గన్నవరం మండలం మార్లపాలెం గ్రామం నుంచి భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గన్నవరం అభివృద్ధికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో అవసరమని వెంకట్రావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులు గెలిస్తే ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత గన్నవరం డంపింగ్ యార్డు సమస్యను శాశ్వతంగా పరిష్కరించినట్లు చెప్పారు. గన్నవరం, కేసరపల్లి, బుద్ధవరం గ్రామాల్లో చెత్త సమస్యను పరిష్కరించేందుకు అధికారుల సహకారంతో రూ.54 లక్షలు వెచ్చించి చెత్త తరలింపు వాహనాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. గన్నవరానికి పూర్వవైభవం తీసుకొచ్చేలా పట్టణ రూపురేఖలు మార్చిన చరిత్ర తనకు ఉందని వెంకట్రావు పేర్కొన్నారు. జడ్పీటీసీ అభ్యర్థి చిగురుపాటి కుమారస్వామికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. సుమారు 40 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న కుమారస్వామి గతంలో ఒకసారి ఎంపీటీసీగా పనిచేశారని, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించారని అన్నారు. ఎవరితోనూ అనవసర వివాదాలకు వెళ్లకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గానికి మంచి అభ్యర్థి కావాలనే ఆలోచనతో కూటమి తరఫున ఆయనకు అవకాశం కల్పించామని చెప్పారు. కుమారస్వామి గెలిస్తే ప్రజలకు మంచి చేస్తారని, అనవసర పంచాయతీలు, సెటిల్మెంట్లకు పాల్పడకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తనకు నమ్మకం ఉందన్నారు. గన్నవరంలో గతంలో చెరువుల తవ్వకాల కారణంగా చిన్నారులు మరణం కు కారణమవరం బాధాకరమని వెంకట్రావు అన్నారు. రాజకీయాలు అంటే ప్రజలకు సేవ చేయడమే తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేయడం కాదన్నారు. కుమారస్వామికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, ఆయనను జడ్పీటీసీగా ఎన్నుకుంటే గన్నవరం అభివృద్ధికి మరింత సహకారం లభిస్తుందని పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలంటే ఎమ్మెల్యే ఒక్కరితోనే సాధ్యం కాదని, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా పనిచేయాలని వెంకట్రావు అన్నారు. తాను అభివృద్ధి పనులకు ఎక్కడా అడ్డుపడలేదని, ఎంపీపీని తొలగించడానికి ప్రయత్నించలేదని, అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా పనిచేశానని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ సంస్కారంతో కూడిన రాజకీయాలనే చేస్తానని వెంకట్రావు స్పష్టం చేశారు. ప్రత్యర్థులు ఎలాంటి భాష ఉపయోగించినా తాను వ్యక్తిగత దూషణలకు దిగలేదని, తన సంస్కారం అడ్డువస్తుందని చెప్పారు. గన్నవరంలో రహదారుల అభివృద్ధి, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, ప్రజలకు వైద్య సేవలు అందించడం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. గతంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది ప్రజల ఇళ్లకు వచ్చి రక్త పరీక్షలు నిర్వహించే పరిస్థితి ఉండేదా అని ప్రశ్నిస్తూ, ప్రస్తుతం ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేస్తున్నామని వివరించారు. గన్నవరం నియోజకవర్గ ముఖచిత్రాన్ని మార్చి, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కూటమి అభ్యర్థులకు అవకాశం కల్పించాలని యార్లగడ్డ వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
