-రైతులు, రైతు కూలీల నుంచి 15 ఫిర్యాదుల స్వీకరణ.. సమస్యల పరిష్కారానికి చర్యలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాజధాని అమరావతిలోని రైతులు, రైతు కూలీలు, గ్రామస్తుల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ (APCRDA) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజధాని ప్రాంత రైతులు, గ్రామస్తులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ APCRDA గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మేనేజ్మెంట్ (GRM) నోడల్ అధికారి పి. జయశ్రీకి అర్జీలు సమర్పించారు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. కొన్ని సమస్యల పరిష్కారం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
రైతులు, స్థానికుల సౌకర్యార్థం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలోని సిటిజన్ గ్రీవెన్స్ సెంటర్ (CGC) వద్ద ప్రతి రోజూ కార్యాలయ పనివేళల్లో అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. ఈ సదుపాయాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
అలాగే ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
వివిధ విభాగాలకు 15 ఫిర్యాదులు
సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో మొత్తం 15 ఫిర్యాదులు అందాయి. వీటిలో:
ల్యాండ్స్ విభాగానికి సంబంధించి 8 ఫిర్యాదులు.
డెవలప్మెంట్ ప్రమోషన్ విభాగానికి 3 ఫిర్యాదులు.
ప్లానింగ్ విభాగానికి 2 ఫిర్యాదులు.
ADCL విభాగానికి 2 ఫిర్యాదులు.
సంబంధిత విభాగాల అధికారులు ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.
రైతుల NPCI, బ్యాంక్ లింకేజీ సమస్యలకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్
గ్రీవెన్స్ డే నిర్వహణతో పాటు రాజధాని రైతుల NPCI, బ్యాంక్ లింకేజీ సమస్యల పరిష్కారం కోసం APCRDA ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు.
ఈ హెల్ప్‌డెస్క్ ద్వారా APCRDA సిబ్బంది పలువురు రైతులకు NPCI లింకేజీ ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో వార్షిక కౌలు సొమ్ము జమ కావడానికి మార్గం సుగమమైంది.
ఈ కార్యక్రమంలో ప్లానింగ్ విభాగం డైరెక్టర్ బి. సురేష్ కుమార్, హెచ్ఆర్ విభాగం డైరెక్టర్ బి. మల్లికార్జున రెడ్డి, కమ్యూనికేషన్స్ విభాగం జాయింట్ డైరెక్టర్ జి. రామరాజు, డిప్యూటీ డైరెక్టర్ (సర్వే) జి.పి. రామకృష్ణన్, ADCL నుంచి ఎస్ఈలు కె. శ్రీనివాసరావు, వి. శ్రీనివాస్, డి. విజయ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
