సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు క్షేమం : కలెక్టర్ హిమాన్షు శుక్ల

-మత్స్యశాఖ అధికారులు, మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకారుల సమన్వయంతో సురక్షితంగా ఒడ్డుకు చేరిన బోటు
-రక్షణ చర్యల్లో అప్రమత్తంగా వ్యవహరించిన అధికారులు, మత్స్యకారులను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త:
కావలి నియోజకవర్గం జువ్వలదిన్నె సమీప సముద్రంలో చేపల వేటకు వెళ్లి బోటు ఇంజన్ చెడిపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. మత్స్యశాఖ అధికారులు, మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకారులు సమన్వయంతో అప్రమత్తంగా చేపట్టిన రక్షణ చర్యలతో బోటును సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో పాటు అందులో ఉన్న ఏడుగురు మత్స్యకారులను క్షేమంగా రక్షించినట్లు వెల్లడించారు.

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు నెల్లూరు సముద్ర తీర ప్రాంతానికి చేరుకున్న సమయంలో సముద్రంలో వాతావరణ మార్పులను గమనించి తిరిగి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు చేరుకునేందుకు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యంలో బోటు ఇంజన్ చెడిపోవడంతో హార్బర్ మౌత్ పాయింట్‌కు సుమారు అర కిలోమీటరు దూరంలో సముద్రంలోనే నిలిచిపోయారు.

ఈ విషయాన్ని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో విధులు నిర్వహిస్తున్న సర్వైలెన్స్ సిబ్బంది గుర్తించి వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దీంతో మత్స్యశాఖ అధికారులు, మెరైన్ పోలీసులు అప్రమత్తమై స్థానిక మత్స్యకారుల సహకారంతో రక్షణ చర్యలు ప్రారంభించారు. సముద్రంలో అలల ఉధృతి అధికంగా ఉండటంతో తొలుత బోటు వద్దకు చేరుకోవడం కష్టతరమైంది.

ఈ క్రమంలో బోటుకు వేసిన లంగరు తెగిపోవడంతో సముద్ర అలల ఉధృతికి బోటు పాతకడపాలెం గ్రామం వైపు కొట్టుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు, స్థానిక మత్స్యకారులు సమన్వయంతో బోటును అనుసరిస్తూ రక్షణ చర్యలను కొనసాగించారు. చివరకు బోటును పాతకడపాలెం సముద్ర తీరానికి సురక్షితంగా చేర్చి అందులో ఉన్న ఏడుగురు మత్స్యకారులను క్షేమంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.

ఈ రక్షణ చర్యల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి మత్స్యకారుల ప్రాణాలను కాపాడిన మత్స్యశాఖ అధికారులు, మెరైన్ పోలీసులు, సర్వైలెన్స్ సిబ్బంది, స్థానిక మత్స్యకారులను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు మత్స్యకారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, అధికారుల సూచనలు పాటించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.