ఖరీఫ్–2026 కరువు పరిస్థితుల పరిశీలనకు ములకనూరు గ్రామాన్ని సందర్శించిన కేంద్ర బృందం

-పెల్లెటైజ్డ్ ప్రీ-మాన్‌సూన్ డ్రై సోయింగ్ (PMDS) విధానంపై అధికారుల వివరణ.. రైతుల అనుభవాలను తెలుసుకున్న కేంద్ర బృందం

అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త:
ఖరీఫ్–2026లో నెలకొన్న కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర కరువు బృందం అనంతపురం జిల్లా కంబదూరు మండలం ములకనూరు గ్రామాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా అమలు చేస్తున్న పెల్లెటైజ్డ్ ప్రీ-మాన్‌సూన్ డ్రై సోయింగ్ (PMDS) విధానాన్ని జిల్లా యంత్రాంగం కేంద్ర బృందానికి వివరించింది.

కేంద్ర కరువు బృందానికి వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిన్మయ్ గోట్మారే నాయకత్వం వహించారు. బృంద సభ్యులుగా మహాలనోబిస్ జాతీయ పంట అంచనా కేంద్రం (MNCFC) సహాయ సంచాలకులు ప్రభా కాంతి, గ్రామీణాభివృద్ధి శాఖ అండర్ సెక్రటరీ వినోద్ సమంత్, వ్యయ విభాగం డిప్యూటీ డైరెక్టర్ పంకజ్ పహాడియా పాల్గొన్నారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణ, మూల్యాంకన డైరెక్టరేట్ డైరెక్టర్ ఎన్.వి. సతీష్ సీమకుర్తి, రాష్ట్ర నోడల్ అధికారి, రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు మనజీర్ జీలానీ సమూన్, జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తదితరులు బృందంలో పాల్గొన్నారు.
4.50 ఎకరాల మామిడి తోట పరిశీలన

కంబదూరు మండలం ములకనూరు గ్రామానికి చెందిన రైతు జి. బాబు నాయుడు సాగు చేస్తున్న 4.50 ఎకరాల వర్షాధార మామిడి తోటను కేంద్ర బృందం సందర్శించింది.

ఈ సందర్భంగా అనంతపురం జిల్లా CT & IO, DPM లక్ష్మా నాయక్ పెల్లెటైజ్డ్ ప్రీ-మాన్‌సూన్ డ్రై సోయింగ్ (PMDS) విధానం గురించి వివరించారు. ఈ విధానంలో విత్తనాలను వర్షాకాలానికి ముందుగానే విత్తుకోవడం, వాటికి రక్షణ కల్పించడం, నేలలోని తేమను సమర్థవంతంగా వినియోగించుకునే సామర్థ్యాన్ని పెంపొందించడం, మొలకెత్తే ప్రక్రియకు అనుకూల పరిస్థితులు కల్పించడం వంటి ప్రయోజనాలను వివరించారు.
అంతర పంటలతో నేల ఆరోగ్యం.. రైతులకు అదనపు ఆదాయం

మామిడి తోటల్లో పెల్లెటైజ్డ్ PMDS విధానం ద్వారా అంతర పంటలు, వివిధ రకాల పంటలను సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు వివరించారు.

ఈ విధానం ద్వారా నేలలో జీవవైవిధ్యం పెరగడం, నేల ఆరోగ్యం మెరుగుపడటం, నేలపై పంటల కవచం ఏర్పడి తేమ సంరక్షణకు దోహదపడటం వంటి అంశాలను తెలియజేశారు.

మామిడి పంటతో పాటు అంతర పంటలు సాగు చేయడం ద్వారా అదనపు దిగుబడి పొందడంతో పాటు రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయని వివరించారు. ముఖ్యంగా కరువు పరిస్థితులను తట్టుకుంటూ వ్యవసాయ పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడం, స్థిరమైన ఆదాయం పొందడం వంటి అంశాల్లో ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందని క్షేత్రస్థాయిలో వివరించారు.
రైతుల అనుభవాలను తెలుసుకున్న కేంద్ర బృందం

ఈ పర్యటనలో భాగంగా కేంద్ర బృందం రైతు జి. బాబు నాయుడుతో మాట్లాడి వ్యవసాయ అనుభవాలను తెలుసుకుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, పెల్లెటైజ్డ్ PMDS విధానం ద్వారా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

ఈ కార్యక్రమంలో రైస్ (RySS) సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ రైతులు, జిల్లా వ్యవసాయ అధికారి (DAO), సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA), మండల వ్యవసాయ అధికారులు (MOA), వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.