మెల్బోర్న్, నేటి పత్రిక ప్రజావార్త:
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఏపీఎన్ఆర్టీ (APNRT) ఆధ్వర్యంలో ప్రవాస తెలుగు మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఏపీఎన్ఆర్టీ రీజినల్, కంట్రీ కో-ఆర్డినేటర్ల నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకలు ఆద్యంతం ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, తెలుగు భాషా వైభవాన్ని చాటిచెప్పాయి.
స్థానిక తెలుగు వారికి, ప్రవాస ఆంధ్రులకు ఏపీ ప్రభుత్వం తరఫున ఏపీఎన్ఆర్టీ అందిస్తున్న సేవలు, సంక్షేమ కార్యక్రమాలను ఈ వేదిక ద్వారా వివరించారు. ప్రవాస ఆంధ్రులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న విశేష సేవలను స్థానిక ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు రీజినల్ కో-ఆర్డినేటర్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీనివాస్ పల్లపోతు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో వివిధ రాష్ట్రాల ఏపీఎన్ఆర్టీ రీజినల్, కంట్రీ సమన్వయకర్తలు కూడా పాల్గొని, నూతనంగా నియమితులైన మెల్బోర్న్ ఏపీఎన్ఆర్టీ ప్రతినిధులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
భారత కాన్సులేట్ నుంచి హేమంత్ పాండే ప్రత్యేకంగా విచ్చేసి, ఏపీఎన్ఆర్టీ కో-ఆర్డినేటర్లకు అభినందన పత్రాలను అందజేశారు. సిడ్నీ నుంచి వచ్చిన ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీనివాస్ పల్లపోతు, రీజినల్ కో-ఆర్డినేటర్ వెంకటేష్ ఎనికపాటి తదితరులు అతిథులకు జ్ఞాపికలను బహూకరించడంతో పాటు, ఈ కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏపీఎన్ఆర్టీ సభ్యత్వాలను మరింతగా పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ (NRI)లకు అందిస్తున్న సేవలు, సహకారాలను స్థానిక తెలుగు వారందరికీ మరింత చేరువ చేయాలని పిలుపునిచ్చారు
.
ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలో ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు వారి ఐక్యతను, ఏపీఎన్ఆర్టీ బలాన్ని చాటుతూ అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై స్థానిక తెలుగు సంఘాలు, ప్రవాసులు హర్షం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
