మురసు తుఫానుపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష

-తెల్లవారుజామున కొత్తపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం.. గంటకు 100–110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
-ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రధాన లక్ష్యం.. అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి: ముఖ్యమంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
మురసు తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగం సంసిద్ధత, ముందస్తు జాగ్రత్త చర్యలు, ప్రజలకు అందిస్తున్న సహాయక సేవలపై సమీక్షించారు.
తెల్లవారుజామున ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద మురసు తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు తుఫాను తీరం దాటే కొత్తపట్నం ప్రాంతంలో వర్షాలు, గాలుల తీవ్రత ఎలా ఉందని ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో చిరుజల్లులు పడుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఒంగోలులో మోస్తరు వర్షం కురుస్తోందని, కొత్తపట్నం సమీపంలో చిరుజల్లులు పడుతున్నాయని అధికారులు వివరించారు.
తుఫాను ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లో తీరం దాటే వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ప్రాణనష్టం నివారణకు అత్యంత ప్రాధాన్యం
టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..
తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100–110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి.
స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల సిబ్బంది ద్వారా తుఫాను హెచ్చరికలు, రక్షణ చర్యలకు సంబంధించిన సమాచారం క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలి.
గతంలో ఆర్నబ్ తుఫాను సమయంలో ప్రాణనష్టాన్ని నివారించేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ కొందరి ప్రాణాలను కాపాడలేకపోయాం. మురసు తుఫానులో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదు.
ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి. అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి.
కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు
గత తుఫానుతో పోలిస్తే ప్రస్తుతం గాలుల వేగం తక్కువగా ఉన్నప్పటికీ విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.
విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం వంటి పరిస్థితులు తలెత్తితే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన సిబ్బంది, పరికరాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
తుఫాను ప్రభావంతో రేపు వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. జిల్లాల వారీగా అంచనా వేసిన సగటు వర్షపాతం వివరాలను ముఖ్యమంత్రి సమీక్షించారు.
జిల్లా అంచనా సగటు వర్షపాతం
ఎన్టీఆర్ 263 మి.మీ., గుంటూరు 242 మి.మీ., బాపట్ల 146 మి.మీ., పల్నాడు 143 మి.మీ., కృష్ణా 97.67 మి.మీ., ప్రకాశం 52.43 మి.మీ., ఏలూరు 51.55 మి.మీ., పశ్చిమ గోదావరి 41.50 మి.మీ.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని పలు మండలాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపు రాష్ట్రంలోని మొత్తం 125 మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుఫాను పూర్తిగా తీరం దాటే వరకు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని స్పష్టం చేశారు.