-రూ.85 కోట్లతో 45 MLD రా వాటర్ ఫిల్ట్రేషన్ ప్లాంట్ MLA బొండా ఉమా
-సింగ్‌నగర్ సహా పలు ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీరు – ఈ నెలలోనే శంకుస్థాపన
-మరో 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారీ వాటర్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ BRTS రోడ్డులోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని తెలిపారు.
ఈ సందర్భంగా బొండా మాట్లాడుతూ రూ.85 కోట్ల వ్యయంతో 45 MLD రా వాటర్ ఫిల్ట్రేషన్ ప్లాంట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ప్రముఖ మెగా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన అనంతరం ముఖ్యంగా సింగ్‌నగర్ ప్రాంతంతో పాటు సెంట్రల్ నియోజకవర్గంలోని నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని… సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌కు స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేసిందని, ముఖ్యంగా వాంబే కాలనీ, రాజీవ్ నగర్, కండ్రిక, న్యూ రాజరాజేశ్వరి పేట, సింగ్‌నగర్, పాయకాపురం, దేవినగర్, రామకృష్ణాపురం, మధురానగర్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సమస్య పూర్తిగా తొలగిపోతుందని తెలిపారు. భవిష్యత్తులో నగర జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని, మరో 50 సంవత్సరాల అవసరాలను తీర్చే విధంగా ఈ ప్రాజెక్టును రూపొందించామని వివరించారు.
ప్రస్తుతం విజయవాడ నగరానికి భవానీపురంలోని హెడ్ వాటర్ వర్క్స్ ద్వారానే తాగునీటి సరఫరా జరుగుతోందని, పెరుగుతున్న జనాభాకు అది సరిపోని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కృష్ణానది ఒడ్డున ఉన్నప్పటికీ ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొనడం బాధాకరమని, ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టును మంజూరు చేయించామని చెప్పారు. ఈ నెలలోనే వాంబే కాలనీలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించిన ఆయన, అవసరమైన ప్రతి ప్రాంతంలో కొత్త ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను నిర్మించి, కొత్త పైప్‌లైన్ల ద్వారా ఈ ప్రాజెక్టును అనుసంధానం చేసి ప్రతి ఇంటికి నాణ్యమైన, స్వచ్ఛమైన తాగునీరు అందించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ముఖ్యంగా 1, 29, 30, 57, 58, 59, 60, 61, 62, 63, 64 డివిజన్లలోని ప్రతి ఇంటికి, ప్రతి అపార్ట్‌మెంట్‌కు తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలకు మౌలిక వసతులు కల్పించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి వెనుకడుగు వేయదని, ఎంత ఖర్చైనా ప్రజల సంక్షేమం, అభివృద్ధే తమ లక్ష్యమని బొండా ఉమా తెలిపారు. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వ హయాంలో సెంట్రల్ నియోజకవర్గంలో రూ.450 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని, రోడ్లు, విద్యుత్ సబ్‌స్టేషన్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, తాగునీటి ప్రాజెక్టులు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. ప్రజలు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా సెంట్రల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగిస్తామని బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో EE గోపాలకృష్ణ, DE సింధూర, మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News