అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించి అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు ఐ&పీఆర్ డైరెక్టర్ విశ్వనాథన్‌ను కలిసి, సుప్రీంకోర్టు మాజీ రిజిస్ట్రార్ జనరల్ నుంచి పొందిన లీగల్ ఒపీనియన్ ను సమర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించిన న్యాయపరమైన, విధానపరమైన అంశాలను డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, ఈ అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి చేర్చాలని కోరారు.
సొసైటీ ప్రతినిధుల వినతిపై ఐ&పీఆర్ డైరెక్టర్ విశ్వనాథన్ చాలా సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌పై ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు చేపడుతోందని, ఈ అంశంపై ప్రభుత్వం స్థాయిలో అవసరమైన ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తెలిపారు. జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్ పురోగతికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశాన్ని పరిష్కరించేందుకు సానుకూలంగా స్పందించిన ఐ&పీఆర్ డైరెక్టర్ విశ్వనాథన్‌కు సొసైటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీం కోర్టు మాజీ రిజిస్టర్ జనరల్ ఇచ్చిన న్యాయ నివేదిక ను అనుసరించి తమ సొసైటీ సభ్యులకు గృహ నిర్మాణం చేసేందుకు ఎటువంటి అడ్డంకి లేదని డైరెక్టర్ కు వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అర్హులైన జర్నలిస్టుల దీర్ఘకాల నిరీక్షణకు త్వరలోనే సానుకూల పరిష్కారం చూపుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం అయ్యుంది.
ఈ కీలక సమావేశంలో అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి పాటిబండ్ల నాగ శ్రీనివాస్, విశాలాంధ్ర బ్యూరో చీఫ్ చావా రవి, సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ రవి కుమార్ బొప్పన, మల్లికార్జునరావు పాల్గొని న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని సమర్పించి, జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌పై ఐ&పీఆర్ డైరెక్టర్‌తో చర్చించారు.
Prajavartha Online Telugu News