Breaking News

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ (స్వయంచాలక లడ్డూ విక్రయ యంత్రం)ను దేవాదాయశాఖ కమిషనర్ శ్రీ కె. రామచంద్ర మోహన్ బుధవారం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికె శీనా నాయక్, సిబ్బంది సమక్షంలో ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా దుర్గగుడి దేవస్థానంలో ఈ స్వయంచాలక యంత్రాన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన ​సందర్భంగా దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ మాట్లాడుతూ… దర్శనార్థం విచ్చేసే భక్తులు ప్రసాదం కౌంటర్ల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే శ్రమ లేకుండా, త్వరితగతిన లడ్డూ ప్రసాదాన్ని పొందేందుకు ఈ ఆధునిక సాంకేతికత ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు జరిపి స్వయంగా క్షణాల్లో ప్రసాదం పొందేలా ఈ యంత్రాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు.ప్రస్తుతం ట్రయల్ రన్ గా ఏర్పాటు చేసామని,ఈ పైలట్ ప్రాజెక్ట్ పనితీరును పరిశీలించిన అనంతరం, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రధాన ప్రాంతాల్లోనూ మరిన్ని యంత్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.

ఉత్సవాలు, రద్దీ రోజుల్లో కాకుండా సాధారణ రోజుల్లో ఈ యంత్రం భక్తులకు ఉపయోగపడుతుందని భావిస్తున్నామని, దేవాలయ వ్యవస్థ లో సాంకేతికతను అందుబాటులోకి తెచ్చామని, ప్రస్తుతం ఆన్ లైన్ విధానంలో హెచ్చు శాతం సేవల టిక్కెట్లు భక్తులు సులభంగా బుక్ చేసుకుంటున్నారని తెలిపారు.

​ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

​ఫేక్ పూజా టికెట్లపై అప్రమత్తం.. దళారులను నమ్మి మోసపోవద్దు: దేవాదాయశాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్

దేవాలయ దర్శనాలు, సేవల పేరిట దళారుల ప్రమేయాన్ని ఉపేక్షించేది లేదని దేవాదాయశాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ స్పష్టం చేశారు. విజయవాడ లో ఇటీవల వెలుగుచూసిన ఫేక్ పూజా టికెట్ల వ్యవహారంపై దేవస్థానం అధికార యంత్రాంగం తక్షణమే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసిందని, బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
​ఈ సందర్భంగా భక్తులకు విజ్ఞప్తి చేస్తూ… అపరిచితులను, మధ్యవర్తులను ఆశ్రయించి పూజా టికెట్ల పేరుతో మోసపోవద్దని హెచ్చరించారు. భక్తుల్లో పూర్తిస్థాయి అవగాహన ఉండాలని, ఆలయ సేవలను కేవలం ప్రభుత్వం, దేవస్థానం అధికారికంగా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్లు, డిజిటల్ యాప్‌లు మరియు అధీకృత కౌంటర్ల ద్వారా మాత్రమే పొందాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పారదర్శకంగా సేవా టికెట్లు పొందాలని, దళారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఇవ్వవద్దని స్పష్టం చేశారు.

​ముమ్మరంగా దసరా శరన్నవరాత్రుల ఏర్పాట్లు.. సామాన్య భక్తులకే అగ్రతాంబూలం: దేవాదాయశాఖ కమిషనర్

ఇంద్రకీలాద్రిపై రాబోయే దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని దేవాదాయశాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు.
​ఈ ఉత్సవాల్లో సామాన్య భక్తునికే అగ్రస్థానం కల్పించే దిశగా ప్రతి విభాగం సమన్వయంతో పనిచేస్తోందని పేర్కొన్నారు.

రద్దీ నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, ప్రసాద వితరణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు.
ఎండ, వర్షాల బారిన పడకుండా షెడ్ల నిర్మాణం, నిరంతర పర్యవేక్షణకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్లేలా ప్రణాళికలు రూపొందించామని, ఉత్సవాలను విజయవంతం చేసేందుకు భక్తులందరూ అధికార యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *