-2027 నాటికి HNSS శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులుపై కేబినెట్‌లో మంత్రి మండిపల్లిని అడిగిన సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హంద్రీ–నీవా సుజల స్రవంతి (HNSS) ఫేజ్–II పనుల పురోగతి, శ్రీనివాసపురం రిజర్వాయర్‌కు సంబంధించిన టెండర్ ప్రక్రియ, పనుల పూర్తిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని అడిగి తెలుసుకున్నారు. HNSS ఫేజ్–IIలో మిగిలిన పనులకు రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరైన నేపథ్యంలో, పనులను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. ముఖ్యంగా శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులను 2027 నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లికి స్పష్టం చేశారు.
రాయచోటి నియోజకవర్గ పరిధిలోని HNSS మెయిన్ కెనాల్ కిమీ 490–535 వరకు సుమారు రూ.350 కోట్ల విలువైన పనులు కూడా సమగ్రంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనులు పూర్తయితే HNSS ద్వారా తాగునీరు, సాగునీటి అవసరాలు తీరడంతో పాటు సుమారు 25 వేల ఎకరాల ఖాళీ చెరువులను నింపి ప్రజలకు నీటి భరోసా కల్పించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి మండిపల్లి తెలిపారు. శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లను HNSS కెనాల్‌తో అనుసంధానం చేసి, మార్గమధ్యంలోని చెరువులను నింపేలా కార్యాచరణ చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. HNSS పనులకు ప్రాధాన్యతనిస్తూ నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు కి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కి మంత్రి మండిపల్లి కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News