Breaking News

ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

-జూలై 6 నుంచి 11 వరకు జిల్లాలో పరీక్షల నిర్వహణ
-మొత్తం 3,824 మంది అభ్యర్థులు హాజరు
-జిల్లా రెవిన్యూ అధికారి పి పోతురాజు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న డిపార్ట్‌మెంట్ పరీక్షలు (మే–2026 సెషన్) విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి పి పోతురాజు తెలిపారు.

శనివారం ఉదయం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో ఏపీపీఎస్సీ, పోలీస్, విద్యుత్, వైద్య ఆరోగ్య, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జూలై 6 నుంచి జూలై 11, 2026 వరకు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించబడనున్నాయని తెలిపారు. జిల్లాలో ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, మొత్తం 3,824 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఆన్‌లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), ఆఫ్‌లైన్ (కన్వెన్షనల్ టైప్) విధానాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఆబ్జెక్టివ్ విధానంలోని పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడతాయని అదేవిధంగా, కన్వెన్షనల్ విధానంలోని పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. అయితే పీసీ నెం.005 పరీక్ష మాత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడుతుందన్నారు.

పరీక్షల నిర్వహణకు జిల్లా స్థాయిలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణ కోసం లైజన్ అధికారిని, చీఫ్ సూపరింటెండెంట్‌ను నియమించినట్లు పేర్కొన్నారు.

పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అంతరాయాలు లేకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ ద్వారా అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, అలాగే పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సూచించారు. పరీక్షల సమయంలో ఎలాంటి విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా పరీక్షా కేంద్రాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

అభ్యర్థులకు సూచనలు

పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు బయోమెట్రిక్ నమోదు కోసం ఉదయం సెషన్‌కు ఉదయం 8 గంటల నుంచి 8.45 గంటల మధ్య పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ప్రత్యేక పరిస్థితుల్లో ఉదయం 9 గంటల వరకు మాత్రమే గ్రేస్ పీరియడ్ ఉంటుంది. మధ్యాహ్నం సెషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.15 గంటల మధ్య కేంద్రానికి చేరుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో మధ్యాహ్నం 2.30 గంటల వరకు మాత్రమే గ్రేస్ పీరియడ్ ఉంటుంది. గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.

అభ్యర్థులు తప్పనిసరిగా అసలైన ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్)తో పాటు హాల్ టికెట్ తీసుకురావాలని సూచించారు.

మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు, కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, హ్యాండ్‌బ్యాగులు, పుస్తకాలు, నోట్స్, రైటింగ్ ప్యాడ్లు తదితర నిషేధిత వస్తువులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని తెలిపారు. రఫ్ షీట్లు, పెన్నులు పరీక్షా కేంద్రంలోనే అందజేయబడతాయని పేర్కొన్నారు.

పరీక్షల సందర్భంగా మాల్ ప్రాక్టీస్ లేదా ఇతర అక్రమాలకు పాల్పడినట్లయితే ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సమావేశంలో ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారులు శంకర్రావు, దేవసహాయం, సీఐ షేక్ అబ్దుల్ నబీ, డిప్యూటీ తహసిల్దార్లు నారాయణ, భవాని, విద్యుత్ శాఖ ఏఈ వంశీ, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *