– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి, త్యాగనిరతి భావితరాలకు మార్గదర్శకమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్, అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జీవితం ధైర్యం, త్యాగం, దేశభక్తి, నాయకత్వానికి ప్రతీక అని.. గిరిజనుల హక్కుల పరిరక్షణకు, స్వేచ్ఛ కోసం ఆయన చేసిన పోరాటం నేటికీ ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. అత్యంత పరిమిత వనరులతోనే బ్రిటిష్ సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొని భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయడం ఆయనకు అందించే నిజమైన నివాళి అని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.
కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News