గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుంటూరు నగర పరిధిలో ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటర్ల సౌకర్యార్థం “ఇంటి నుంచే ఎన్యూమరేషన్” అనే వినూత్న సదుపాయాన్ని ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిందని, ఇటీవల ఇళ్లు మారిన వారు, ప్రస్తుతం తమ సొంత ఊరిలో అందుబాటులో లేని వారు లేదా ఓటర్ లిస్ట్‌లో పేరు లేదని ఆందోళన చెందుతున్న అర్హులైన పౌరులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇకపై బూత్ లెవల్ ఆఫీసర్ (బిఎల్ఓ) మీ ఇంటికి వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా, పౌరులు తాము ఎక్కడున్నా ఆన్లైన్ ద్వారానే తమ ఓటు వివరాలను సులభంగా నమోదు లేదా సరిచేసుకోవచ్చని తెలిపారు. ఈ ఆన్లైన్ ఎన్యూమరేషన్ ప్రక్రియను అత్యంత సులభంగా పూర్తి చేసుకోవచ్చని, ఇందుకోసం ఓటర్లు తమ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ voters.eci.gov.in ను సందర్శించి, తమ ఎపిక్ (ఓటర్ ఐడీ) నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ అయి, తమ ఆధార్ నంబర్‌ను ఉపయోగించి ఈసైన్ ద్వారా ఆన్లైన్ లోనే వివరాలను సురక్షితంగా ధృవీకరించుకోవచ్చని తెలిపారు. ఈ సదుపాయం వల్ల ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా, ఇంట్లోనే కూర్చుని కేవలం కొద్ది నిమిషాల్లోనే ప్రక్రియను పూర్తి చేసి తమ సమయాన్ని ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఓటు అనేది మన హక్కు మరియు బాధ్యత అని గుర్తు చేస్తూ, గుంటూరు నగర పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్కరూ తక్షణమే ఆన్లైన్ లో ఎన్యూమరేషన్ పూర్తి చేసుకొని ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలని కోరారు.
Prajavartha Online Telugu News