Breaking News

రికార్డుల నిర్వహణలో పారదర్శకత, నిబంధనల అమలే అధికారులకు రక్షణ కవచం

-ఆర్థిక క్రమశిక్షణ, పకడ్బందీ డాక్యుమెంటేషన్, ఆదాయ వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
-గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామపంచాయతీ పరిపాలనలో నిబంధనలను కచ్చితంగా పాటించడం, ప్రతి పనికి సంబంధించిన రికార్డులను పకడ్బందీగా నిర్వహించడం, ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరించడం ద్వారా మాత్రమే అధికారులు భవిష్యత్తులో ఎదురయ్యే క్రమశిక్షణాపరమైన ఇబ్బందులను నివారించగలరని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అన్నారు.

జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో గ్రామపంచాయతీ పరిపాలనపై గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.

గ్రామపంచాయతీల్లో నమోదవుతున్న అనేక క్రమశిక్షణా చర్యలకు ఉద్దేశపూర్వక తప్పిదాల కంటే అవగాహన లోపం, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం, నిబంధనల అమలులో లోపాలే ప్రధాన కారణాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి నిర్ణయానికి సంబంధించిన ఆధారాలు, రికార్డులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు.

టెండర్ ద్వారా చేపట్టాల్సిన పనులను నామినేషన్ పద్ధతిలో అమలు చేసే ప్రయత్నాలు చేయరాదని, ప్రభుత్వం నిర్దేశించిన ఆర్థిక పరిమితులు, టెండర్ విధానాలు, పరిపాలనా, సాంకేతిక అనుమతులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. టెండర్ నోటీసుల ప్రచురణ, ప్రచారం, బిడ్డర్ల ఎంపిక, మూల్యాంకనం వంటి ప్రతి దశకు సంబంధించిన పూర్తి రికార్డులను భద్రపరచాలని చెప్పారు.

పరిపాలనా అనుమతులు లేకుండా పనులు చేపట్టడం, నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేయడం వల్ల అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. ఇంజినీరింగ్ శాఖ కొలతల పుస్తకం (ఎం-బుక్), చెక్ మెజర్‌మెంట్, పాస్ ఆర్డర్ తదితర పత్రాలను పరిశీలించిన తర్వాతే చెల్లింపులు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్, ఫోటోలు, వినియోగ వివరాలు వంటి రికార్డులను కూడా తప్పనిసరిగా నిర్వహించాలని తెలిపారు.

అందుబాటులో ఉన్న నిధులు, తప్పనిసరి వ్యయాలు, మిగిలే వినియోగ నిధులపై స్పష్టమైన అవగాహనతో గ్రామపంచాయతీలు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. నిధుల కొరతతో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఒక రూపాయి ఖర్చు చేస్తే ప్రజలకు ఎక్కువ ప్రయోజనం చేకూరే పనులను ఎంపిక చేసుకోవాలని అన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో స్మశానవాటికల అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపట్టాలని, ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అలాగే గ్రామపంచాయతీలు ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఇతర ఆదాయ వనరులు కలిగిన ఆస్తులను అభివృద్ధి చేసి స్వంత ఆదాయాన్ని పెంచుకునే దిశగా ఆలోచించాలని తెలిపారు.

గ్రామపంచాయతీ కార్యదర్శులు కేవలం ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా గ్రామాభివృద్ధికి బాధ్యత వహించే నిర్వాహకులుగా వ్యవహరించాలని, వివిధ శాఖల పథకాలను సమన్వయం చేసి గ్రామాలకు శాశ్వత ప్రయోజనం చేకూరే ఆస్తుల సృష్టిపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు.

కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారిణి ఎం ధనలక్ష్మి, డి ఎల్ పి ఓ రజావుల్లా, మచిలీపట్నం డి ఎల్ డి ఓ రామానందం, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు,
కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *