అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక గొడ్డలి పార్టీ ఉద్దేశపూర్వకంగా రోజూ ఏదో ఒక కార్యక్రమం తీసుకొని ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని… మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ లాంటి సమాజ విధ్వంసంకులు చేసిన వ్యాఖ్యలను జగన్ రెడ్డి ఖండించాల్సింది పోయి సమర్థిస్తున్నారని మండిపడ్డారు. మహిళలను, రాజ్యాంగ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా మాట్లాడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటే… గొడ్డలి పార్టీ వారికి అండగా నిలబడి మాట్లాడుతోంది. సమాజంలో అశాంతి రేకెత్తిస్తున్న ‘రావణ్’ అనే యూట్యూబర్‌పై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే… దేశంలో ఏదో పెద్ద విపత్తు వచ్చినట్లు, రావణ్ ఏదో స్వాతంత్ర్య సమరయోధుడు అయినట్లుగా జగన్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు. గతంలో చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం పని అయిపోయిందని సంబరపడ్డారు, కానీ ప్రజలు గొడ్డలి పార్టీకి 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా వారి బుద్ధి ఇంకా మారలేదు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.
24 నెలల పాలనలోనే రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల వలె సమానంగా ముందుకు తీసుకెళ్తున్నాం. గత ఐదేళ్ల గొడ్డలి పార్టీ పాలనలో రాష్ట్రంపై పడిన చీకటి మబ్బులు తొలగిపోయి, ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులు తరలివస్తున్నాయి. గత 24 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఏనాడూ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ప్రవర్తించలేదు. కనీసం అసెంబ్లీకి కూడా రావడం లేదు. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్లీ రాజధాని గురించి మాట్లాడటం హాస్యాస్పదం. జగన్ రెడ్డికి అసలు అమరావతి సీఆర్‌డీఏ పరిమితుల గురించి కనీస అవగాహన కూడా లేదు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిని ‘భ్రమరావతి’ అని అవహేళన చేసి, మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని 15 ఏళ్లు వెనక్కి నెట్టారు. ఆనాడు మీరు చెప్పిన మూడు రాజధానుల లీలలను ప్రజలు ఘోరంగా తిరస్కరించారు. భవిష్యత్తులో జగన్ రెడ్డి లాంటి దుర్మార్గులు ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకూడదనే లక్ష్యంతో మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉభయ సభల్లో అమరావతి బిల్లును పాస్ చేసి దానికి పూర్తి చట్టబద్ధత కల్పించాం. ఈ చట్టబద్ధత ఉండటం వల్లే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రతిష్టాత్మక ఐటీ సంస్థలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, డేటా సెంటర్లు అమరావతికి తరలి వస్తున్నాయి.
దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌కు అత్యధికంగా పెట్టుబడులు వస్తున్నాయి. వైజాగ్‌కు గూగుల్ డేటా సెంటర్ వస్తే, అది తాము చేసిందేనని జగన్ రెడ్డి డబ్బా కొట్టుకుంటున్నారు. తన నియోజకవర్గానికి కూత వేటు దూరంలో ఉన్న జమ్మలమడుగులో ఐదేళ్ల పాటు కేవలం శిలాఫలకాలకే పరిమితం చేసిన జిందాల్ స్టీల్ ప్లాంట్ పనులను, కూటమి ప్రభుత్వం వచ్చాకే పనులు ప్రారంభించింది. రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు ఎంత మేలు చేస్తున్నారు. ఈరోజు రాయలసీమ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందంటే దానికి కారణం కృష్ణా నది నీళ్లను కుప్పంలోని చివరి ప్రాంతానికి సైతం తీసుకువెళ్లింది చంద్రబాబు విజనే.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కుప్పం ప్రజలను పీడిస్తే, ఈ రెండు సంవత్సరాలలోనే కుప్పం రూపురేఖలను మార్చిన ఘనత చంద్రబాబుకి దక్కింది. చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా మొన్న మూడు రోజులు ముఖ్యమంత్రితో కలిసి కుప్పంలో పర్యటించినప్పుడు, ఒకే రోజు రూ.11,000 కోట్ల పెట్టుబడుల శంకుస్థాపన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ప్రపంచంలోనే నంబర్ వన్ షూ తయారీ సంస్థ అయిన ఆడిడాస్ కంపెనీని కుప్పంలో నెలకొల్పుతున్నాం. రూ.900 కోట్ల పెట్టుబడితో గుడిపాడు మండలంలో అత్యాధునిక చికెన్ ప్రాసెసింగ్ యూనిట్, రూ.117 కోట్ల వ్యయంతో దేశంలోనే లేని విధంగా మోడల్ బస్ టర్మినల్‌ను నిర్మిస్తున్నాం.
చిన్న వయసులోనే రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుబడుల పరంపరను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చే బాధ్యతను మంత్రి నారా లోకేష్ భుజాలపైన వేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రరాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబడబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ కుటుంబాల్లో వెలుగులు నింపితే… క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటూ ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన సాగిస్తున్నాం. గొడ్డలి పార్టీ అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని గ్రహించాలి.
Prajavartha Online Telugu News