– ప్రభుత్వాన్ని కోరిన ఏపీ వక్ఫ్ బోర్డు
– వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు జిల్లా స్థాయిలో పరిపాలన మరింత బలోపేతం కావాలి
– ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, ఆక్రమణల నివారణ, న్యాయపరమైన చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో వక్ఫ్ పరిపాలనను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లా రెవెన్యూ అధికారి (DRO) జిల్లా వక్ఫ్ అధికారిగా, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి (DMWO) అదనపు జిల్లా వక్ఫ్ అధికారిగా వ్యవహరిస్తున్నారని, అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జాయింట్ కలెక్టర్‌ను జిల్లా వక్ఫ్ అధికారిగా, జిల్లా రెవెన్యూ అధికారిని అదనపు జిల్లా వక్ఫ్ అధికారిగా నియమించేలా ప్రభుత్వ ఉత్తర్వుల్లో సవరణలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వక్ఫ్ బోర్డు ప్రతిపాదించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల వక్ఫ్ భూములు ఆక్రమణలు, న్యాయ వివాదాలు, అక్రమ నిర్మాణాల సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసు, రిజిస్ట్రేషన్, మున్సిపల్ తదితర శాఖల మధ్య సమన్వయం పెరిగి వక్ఫ్ ఆస్తుల రక్షణ, ఆక్రమణల తొలగింపు, న్యాయపరమైన చర్యలు మరింత వేగవంతంగా అమలవుతాయని అన్నారు. ఈ మేరకు వక్ఫ్ బోర్డు తీర్మానం చేసి ప్రభుత్వానికి అధికారికంగా ప్రతిపాదనలు పంపిందని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి ఫరూక్ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కు ఎంతగానో శ్రమిస్తున్నారని, సహకరిస్తున్నారని తెలిపారు. వక్ఫ్ ఆస్తులను భావితరాలకు భద్రపరచడం రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రధాన బాధ్యత అని, ఆ దిశగా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, సంబంధిత శాఖల సమన్వయంతో మరింత సమర్థవంతంగా పనిచేస్తామని అబ్దుల్ అజీజ్ తెలిపారు.
Prajavartha Online Telugu News