ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారు కార్తీక శుద్ధ విదియ (భగినీ హస్తభోజనం – భ్రాతృవిదియ) పురస్కరించుకుని నవంబర్ 11న విశేషంగా గాజుల అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు. శ్రీ అమ్మవారికి కుంకుమ, గాజులు అత్యంత ప్రీతిపాత్రమైనవి కావడంతో దేవస్థాన ఆనవాయితీ ప్రకారం ఈ దివ్య అలంకారాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
ఈ విశేష పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ అమ్మవారి దివ్యాలంకరణ నిమిత్తం విజయవాడకు చెందిన శ్రీ గ్రంధి రాము, శ్రీమతి రాధిక దంపతులు మరియు ‘శ్రీ కనకదుర్గ లలితా పారాయణ బృందం’ తరఫున 446 తోడాల గాజులను దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ కు అందజేశారు.
ఈ సందర్భంగా దాతలను ఈవో వి.కె. శీనా నాయక్ ప్రత్యేకంగా అభినందిస్తూ… గాజుల ఉత్సవం వేళ అమ్మవారి దివ్య అలంకరణ కొరకు భక్తులు సైతం తమ వంతుగా గాజులను విరాళంగా సమర్పించవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు దేవస్థానం టోల్ ఫ్రీ నెంబర్ : 18004259099 ను సంప్రదించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
”భగినీ హస్తభోజనం వేళ గాజుల అలంకారంలో దర్శనమివ్వనున్న శ్రీ కనకదుర్గమ్మవారు “
