-దీపావళి బాణసంచాపై కఠిన ఆంక్షలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ పర్యావరణ పరిహారం
-గ్రీన్ క్రాకర్స్‌కే ప్రాధాన్యం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు, నిరంతర పర్యవేక్షణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో పెరుగుతున్న వాయు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించి ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) సమగ్ర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. పట్టణీకరణ, పారిశ్రామిక అభివృద్ధితో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు చట్టపరమైన చర్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిరంతర పర్యవేక్షణతో పాటు భారీ పర్యావరణ పరిహారాలను అమలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా దీపావళి 2026 సందర్భంగా బాణసంచా వినియోగంపై కఠిన నిబంధనలు అమలు చేయనుంది.
శబ్ద కాలుష్యంపై ప్రత్యేక నిఘా
వాయు కాలుష్య నియంత్రణ చట్టం-1981 పరిధిలో శబ్ద కాలుష్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం G.O.Ms.No.172 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం పారిశ్రామిక ప్రాంతాల్లో పగటిపూట 75, రాత్రిపూట 70 డెసిబుల్స్, వాణిజ్య ప్రాంతాల్లో 65, 55 డెసిబుల్స్, నివాస ప్రాంతాల్లో 55, 45 డెసిబుల్స్, నిశ్శబ్ద ప్రాంతాల్లో 50, 40 డెసిబుల్స్‌కు మించకుండా శబ్ద స్థాయిలు ఉండాలి.
ఆసుపత్రులు, విద్యాసంస్థలు, న్యాయస్థానాల చుట్టూ 100 మీటర్ల పరిధిని నిశ్శబ్ద ప్రాంతాలుగా పరిగణిస్తారు. ఈ ప్రాంతాల్లో హారన్ మోగించడం నిషేధం. నిబంధనల అమలు బాధ్యతలను ప్రధానంగా పోలీసు, రవాణా శాఖలకు అప్పగించారు.
ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు
రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు అనుమతి లేకుండా లౌడ్స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ వ్యవస్థలను వినియోగిస్తే రూ.10 వేల పర్యావరణ పరిహారం విధించడంతో పాటు పరికరాలను స్వాధీనం చేసుకుంటారు. డీజిల్ జనరేటర్ల సామర్థ్యాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు పరిహారం విధించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించే జనరేటర్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు సీల్ చేసే చర్యలు కూడా చేపడతారు.
గ్రీన్ క్రాకర్స్‌కే అనుమతి
దీపావళి సమయంలో వాయు, శబ్ద కాలుష్యం పెరిగే ప్రమాదం ఉన్నందున బాణసంచా వినియోగంపై ఏపీపీసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. 2025 దీపావళి సందర్భంగా విశాఖపట్నంలో పీఎం-10 స్థాయులు 238 మైక్రోగ్రాములు, పీఎం-2.5 స్థాయులు 138 మైక్రోగ్రాములు నమోదైనట్లు మండలి వెల్లడించింది.
ఈ నేపథ్యంలో గాలి నాణ్యత మోస్తరు లేదా అంతకంటే మెరుగ్గా ఉన్న నగరాలు, పట్టణాల్లో మాత్రమే సీఎస్ఐఆర్-నీరి ధ్రువీకరించిన గ్రీన్ క్రాకర్స్ తయారీ, నిల్వ, విక్రయాలు, వినియోగానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. బేరియం లవణాలు వంటి నిషేధిత రసాయనాలు కలిగిన సంప్రదాయ బాణసంచా తయారీ, విక్రయాలు, వినియోగంపై నిషేధం అమలు చేయనుంది.
ప్రతి గ్రీన్ క్రాకర్ బాక్స్‌పై ప్రత్యేక క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండాలి. దాని ద్వారా తయారీదారు రిజిస్ట్రేషన్, పేలుడు పదార్థాల లైసెన్సు, తయారీ బ్యాచ్, రసాయనాల పరీక్షా ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అనుమతించిన జాయింటెడ్ గ్రీన్ క్రాకర్స్ తయారీదారులు కూడా సీఎస్ఐఆర్-నీరి వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
నిర్దేశిత వేళల్లోనే బాణసంచా
న్యాయస్థానాల మార్గదర్శకాల ప్రకారం బాణసంచా వినియోగాన్ని నిర్దేశిత సమయాలకే పరిమితం చేయనున్నారు. కొన్ని మార్గదర్శకాల ప్రకారం రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే బాణసంచా కాల్చేందుకు అనుమతి ఉంటుంది. ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, విద్యాసంస్థలు, నోటిఫై చేసిన నిశ్శబ్ద ప్రాంతాల చుట్టూ 300 మీటర్ల పరిధిని నో-క్రాకర్ జోన్‌గా పరిగణించి బాణసంచా వినియోగాన్ని నిషేధించాలని సూచించారు.
అధికారులకు ఏపీపీసీబీ ఆదేశాలు
దీపావళి సందర్భంగా సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ అక్టోబరు 23న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు, పోలీసు సూపరింటెండెంట్లు, రవాణా శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్లకు ఏపీపీసీబీ లేఖలు పంపింది.
జిల్లా యంత్రాంగం, పోలీసు, రవాణా, మున్సిపల్ శాఖల అధికారులు సంయుక్త బృందాలుగా ఏర్పడి బాణసంచా విక్రయ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. అక్రమ విక్రయాలు, నిషేధిత బాణసంచా రవాణా, వినియోగాన్ని అరికట్టడంతో పాటు గాలి, శబ్ద కాలుష్య స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది. అక్టోబరు 16న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేసింది.
ప్రజల భాగస్వామ్యంతోనే కాలుష్య నియంత్రణ
ప్రశాంతమైన వాతావరణంలో జీవించే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కులో భాగమని జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ మండలి చర్యలు చేపడుతోంది. విద్యాశాఖ, రవాణా సంఘాలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఎలక్ట్రానిక్ మీడియా సహకారంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది.
కాలుష్య నియంత్రణ ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యంతోనే సమర్థవంతంగా సాధ్యమవుతుందని ఏపీపీసీబీ ఛైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య తెలిపారు. స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం, ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణ వ్యవస్థల సంరక్షణ లక్ష్యంగా అన్ని శాఖల సమన్వయంతో చర్యలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
