-సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలితో పాటు రెగ్యులర్ చెక్ అప్ మరియు వైద్యం ద్వారా షుగర్, బిపి ముప్పులను ఎదుర్కోవచ్చు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా ఆరోగ్య వేదిక మరియు జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో షుగర్, బిపి, ఫిట్స్, పక్షవాతం జబ్బులకు ప్రతి రెండు నెలలకు మూడవ ఆదివారం నిర్వహించబడుతున్న హెల్తీ విజయవాడ రెగ్యులర్ మెడికల్ క్యాంపు ఆదివారం పాయకాపురం లహరి విద్యా మందిర్ లో జయప్రదంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా మెడికల్ క్యాంపుకు వచ్చిన రోగులను ఉద్దేశించి ప్రముఖ వైద్యులు డాక్టర్ చావా మురళీకృష్ణ, డాక్టర్ బి . శ్రీహర్ష మాట్లాడుతూ సరైన ఆహారపు అలవాట్లు మరియు చక్కని జీవనశైలితో పాటు రెగ్యులర్ చెకప్ మరియు వైద్యం తోనే షుగర్ మరియు బీపీ జబ్బు ముప్పులను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని , వైద్యుల సూచనలను పాటించాలని, క్రమం తప్పకుండా మందులు వాడాలని సూచించారు. పేద , మధ్యతరగతి ప్రజల కొరకు ఎన్నో వ్యయ ప్రయాసలతో ప్రజా ఆరోగ్య వేదిక మరియు జన విజ్ఞాన వేదిక రెగ్యులర్గా మెడికల్ క్యాంపును నిర్వహించడం అభినందించదగిన విషయమని అన్నారు.
అనంతరం ప్రముఖ వైద్యులు డాక్టర్ చావా మురళీకృష్ణ మరియు ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ బి. శ్రీహర్ష రోగులను పరీక్షించి వారికి అవసరమైన మందులను రాయగా మెడికల్ క్యాంప్ వాలంటీర్లు రోగులకు అవసరమైన టాబ్లెట్లు మరియు ఇన్సులిన్లను పంపిణీ చేశారు. మందులు ఎలా వాడాలో వివరించారు. ప్రజా ఆరోగ్య వేదిక ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు హెల్తీ విజయవాడ రెగ్యులర్ మెడికల్ క్యాంపు కోఆర్డినేటర్ జి. విజయ్ ప్రకాష్ రోగుల సమస్యలను తెలుసుకొని, అందుకు అనుగుణంగా వాలంటీర్లకు సూచనలు అందించారు.
క్యాంపులో జన విజ్ఞాన వేదిక నగర కార్యదర్శి వి. శ్రీనివాస్, ప్రజా ఆరోగ్య వేదిక మరియు జే వి వి నేతలు బోయి రవి, ఎం . సత్య ప్రసాద్ , రంగారెడ్డి , విజిత , భాను ప్రసాద్, దుర్గారావు, మురళి, సుందర రామరాజు , శ్రీరామ్, జోగిరాజు, శ్రీధర్, మధు తదితరులు పాల్గొన్నారు
నేడు జరిగిన మెడికల్ క్యాంపులో సుమారు 200 మంది రోగులకు సేవలు అందించడం జరిగింది. రెండు నెలలకోసారి మూడవ ఆదివారం నాడు జరిగే ఈ క్యాంపు తిరిగి సెప్టెంబర్ 20వ తేదీన హెల్తి విజయవాడ రెగ్యులర్ మెడికల్ క్యాంపు నిర్వహించబడుతుందనీ ప్రజా ఆరోగ్య వేదిక జిల్లా కార్యదర్శి, క్యాంప్ కోఆర్డినేటర్ జి. విజయ్ ప్రకాష్ తెలిపారు.
Prajavartha Online Telugu News