-విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఏ. రవీంద్రరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఏ. రవీంద్రరావు గురువారం ఉదయం తన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కృష్ణలంక, రాణి గారి తోట ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని కంపాక్టర్ బిన్లను క్రమం తప్పకుండా పరిశుభ్రపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బిన్లలో నిల్వ ఉన్న చెత్తను సకాలంలో తరలించడంతో పాటు, బిన్ల లోపల, బయట పూర్తిగా శుభ్రం చేసి దుర్వాసన, ఈగలు, దోమలు వ్యాపించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కంపాక్టర్ బిన్ల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని, చెత్త ఎక్కడా పేరుకుపోకుండా నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. నగర పరిశుభ్రతకు ఎలాంటి ఆటంకం కలగకుండా పారిశుద్ధ్య సిబ్బంది, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం రాణిగారితోటలోని అన్న క్యాంటీన్‌ను ఇంచార్జ్ కమిషనర్ ఏ. రవీంద్రరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్యాంటీన్‌లో ఆహార తయారీ, నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, వంటగది నిర్వహణ, భోజనం వడ్డించే విధానాన్ని పరిశీలించి లబ్ధిదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా అన్ని వేళలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్చార్జ్ డాక్టర్ గోపాల నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News