విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్ఠం చేసి ప్రజారోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం, స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0 ఆధ్వర్యంలో చేపట్టిన “సఫాయి అప్నావో – బీమారీ భగావో (SABB)” ప్రత్యేక కార్యక్రమం ద్వారా స్వచ్ఛతపై ప్రజల్లో చైతన్యం కల్పించామని విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీస్ డాక్టర్ గోపాల నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం హెచ్ బి కాలనీ, భవానిపురం ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో కాలువల పూడికల తొలగింపు పనులను చేపట్టారు.
ఈ సందర్భంగా ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల నాయక్ మాట్లాడుతూ, గత పది రోజులుగా సఫాయి అప్నావో – బీమారీ భగావో కార్యక్రమాన్ని జోనల్ కమిషనర్ల సమన్వయంతో నగరంలోని అన్ని వార్డు పారిశుద్ధ్య, శానిటరీ ఇన్స్పెక్టర్లు,కార్యదర్శులు, బయాలజిస్టు, ప్రత్యేక అధికారులు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా చేశారని అన్నారు.
కార్యక్రమంలో భాగంగా నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్లు నిర్వహించడం, చెత్త పేరుకుపోయే ప్రాంతాలను పూర్తిగా శుభ్రపరచడం, వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో డ్రైన్లను శుభ్రపరచడం, దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్లు, ఫాగింగ్ చేపట్టడం, ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ఇంటింటికీ వెళ్లి చెత్త వేరు చేసే విధానంపై ప్రచారం చేయడం, పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య శిబిరాలు, భద్రతా పరికరాల వినియోగంపై శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టామని అన్నారు.
మురికివాడలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టి చెత్త తొలగింపు, డ్రైనేజీ శుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ, సామాజిక మరుగుదొడ్ల పరిశుభ్రత, నిర్వహణను నిరంతరం పర్యవేక్షించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు.
Prajavartha Online Telugu News