-మహిళల, పిల్లల అక్రమ రవాణా, వెట్టిచాకిరి నిర్మూలనకు సమష్టి కృషి అవసరం
-ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు, చిన్నారుల అక్రమ రవాణాను సమూలంగా అరికట్టాలంటే సమాజంలోని ప్రతి ఒక్కరిలో అవగాహన, అప్రమత్తత పెరగడం అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం విజయవాడ కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ “మానవ అక్రమ రవాణా నిరోధక గోడపత్రిక”ను ఆవిష్కరించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవం నిర్వహణ వెనుక ప్రధాన ఉద్దేశ్యం ప్రజల్లో అవగాహన పెంపొందించడమేనని తెలిపారు. మహిళలు, పిల్లల అక్రమ రవాణాపై సమాజంలో చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల్లో అవగాహన పెంపొందితే వారు తమ కుటుంబ సభ్యులతో పాటు సమాజాన్ని కూడా రక్షించగలరని కలెక్టర్ పేర్కొన్నారు. యువతలో బాధ్యతాయుతమైన ఆలోచన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాలను ఉపయోగించి యువతను మోసగించే ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, విద్య, మంచి అవకాశాల పేరుతో మోసగాళ్లు వల వేస్తున్నందున యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినప్పటికీ మానవ అక్రమ రవాణా, లైంగిక దోపిడీ, వెట్టిచాకిరి, బాలల అక్రమ రవాణా, బలవంతపు భిక్షాటన, బలవంతపు వివాహాలు, అవయవాల అక్రమ విక్రయాలు వంటి దారుణాలు ఇప్పటికీ కొనసాగుతుండటం ఆందోళనకరమని కలెక్టర్ పేర్కొన్నారు. వీటిపై సమాజమంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అవగాహన లోపం కారణంగానే మహిళలు, చిన్నారులు మోసపోతున్నారని కలెక్టర్ తెలిపారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేయడం, సామాజిక మాధ్యమాల ద్వారా మోసాలకు పాల్పడడం వంటి ఘటనల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిన్నారులు, మహిళలు, అనాథలు, చదువు మధ్యలో మానేసిన పిల్లలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన వారు మానవ అక్రమ రవాణాకు ఎక్కువగా బలవుతున్నారని తెలిపారు. గ్రామ, వార్డు స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ నేరాలను అరికట్టవచ్చని చెప్పారు. సందేహాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. మానవ అక్రమ రవాణా, బాలల రక్షణ, లైంగిక నేరాల నియంత్రణకు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), పోక్సో చట్టంతో పాటు ఇతర చట్టాల్లో కఠినమైన శిక్షలు ఉన్నాయని తెలిపారు. 18 సంవత్సరాల లోపు పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చిన్నారులకు సంబంధించిన అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని సూచించారు.
జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గుంటుపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో వెట్టిచాకిరి నిర్మూలన కోసం నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. మానవ అక్రమ రవాణా ఒక వ్యవస్థీకృత నేరమని, నేరగాళ్లు ముందుగా వ్యక్తుల నమ్మకాన్ని సంపాదించి అనంతరం మోసాలకు పాల్పడతారని పేర్కొన్నారు. చదువు లేదా ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే యువత అపరిచితులను సులభంగా నమ్మరాదని సూచించారు. కొంతమందిని వ్యభిచార గృహాలకు విక్రయించడం, బంధువులే మోసపూరితంగా అక్రమ రవాణాకు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ధనలక్ష్మి తెలిపారు. అప్రమత్తతే ప్రధాన రక్షణ అని పేర్కొంటూ మహిళలు “శక్తి” వంటి భద్రతా యాప్‌లను వినియోగించుకోవాలని సూచించారు.
వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందిన 22 మంది బాధితులకు ప్రాథమిక పునరావాస నిధుల కింద ఒక్కొక్కరికి రూ.30,000 చొప్పున మొత్తం రూ.6,60,000ను వారి ఖాతాలలో జమ చేసేందుకు జిల్లా కలెక్టర్ నిధులను విడుదల చేశారు. ఈ బాధితులు 2025 మే 7న నున్న ప్రాంతంలోని ఒక ఇటుక బట్టీ వద్ద వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందిన ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికులు. బాధితులు సాధారణ జీవనంలో స్థిరపడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ తిరుపతిరావు, ఎన్జీవో ప్రతినిధి రామకృష్ణ, సోషల్ వర్కర్లు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News