-మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తుల రూపకల్పన
-రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి తూర్పు గోదావరి జిల్లా అంగర, పులుగుర్త ప్రాథమిక చేనేత సహకార సంఘాలను సందర్శించి, చేనేత కార్మికులు తయారు చేస్తున్న ఉత్పత్తులు, సంఘాల పనితీరు, మార్కెటింగ్ విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చేనేత ఉత్పత్తుల వైవిధ్యీకరణ, ఉత్పత్తుల అభివృద్ధి, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను రూపొందించడంపై ఆమె నేతన్నలు పలు సూచనలు చేశారు.
చేనేత కార్మికులు తయారు చేస్తున్న చీరలను డ్రెస్ మెటీరియల్స్గా మార్చడంతో పాటు, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త డిజైన్లు, రంగులు, నమూనాలతో ఉత్పత్తులను రూపొందించాలని కమిషనర్ నేతన్నలకు సూచించారు. చేనేత ఉత్పత్తులకు మార్కెట్లో మరింత ఆదరణ పెంచేందుకు నాణ్యతతో పాటు ఆధునిక డిజైన్లు, ఉత్పత్తుల వైవిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
అంగర చేనేత సహకార సంఘాన్ని సందర్శించిన సందర్భంగా చేనేత కార్మికులతో ఆమె మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రస్తుత మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తులను రూపొందించాలని, చేనేత వస్త్రాలకు మరింత విలువను జోడించే విధంగా ఉత్పత్తుల తయారీ చేపట్టాలని సూచించారు.
పులుగుర్త చేనేత సహకార సంఘంలో కూడా ఉత్పత్తుల తయారీ ప్రక్రియను పరిశీలించిన కమిషనర్, చేనేత రంగంలో
ప్రొడక్ట్ డెవలప్మెంట్ డైవర్సిఫికేషన్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. చీరలతో పాటు డ్రెస్ మెటీరియల్స్, ఇతర వినూత్న ఉత్పత్తులను అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా చేనేత కార్మికులకు అదనపు ఆదాయాన్ని కల్పించవచ్చని పేర్కొన్నారు. చేనేత రంగంలో ఉత్పత్తుల అభివృద్ధి, డిజైన్ అభివృద్ధి, మార్కెటింగ్, నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రేఖా రాణి ఆదేశించారు.
వినియోగదారుల అభిరుచులు, మార్కెట్ డిమాండ్‌ను నిరంతరం అధ్యయనం చేసి, అందుకు అనుగుణంగా చేనేత ఉత్పత్తులను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా చేనేత కార్మికుల ఆదాయాన్ని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించిన ఆమె, ఉత్పత్తుల వైవిధ్యీకరణ ద్వారా మార్కెట్‌ను విస్తరించి చేనేత కుటుంబాలకు మెరుగైన జీవనోపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
చేనేత కార్మికులకు డిజైన్ అభివృద్ధి, ఉత్పత్తుల వైవిధ్యీకరణ, మార్కెట్ అవసరాలపై శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శిక్షణ ద్వారా నూతన డిజైన్లు, మార్కెట్‌కు అనుగుణమైన ఉత్పత్తులను తయారు చేయగలిగితే చేనేత వస్త్రాలకు మరింత గిరాకీ పెరుగుతుందని పేర్కొన్నారు.
అదేవిధంగా చేనేత కార్మికుల తయారీ ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి, వారి ఉత్పత్తులకు మంచి ధర లభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం చేనేత రంగంలో ఒక్కో ఉత్పత్తికి సుమారు రూ.900 నుంచి రూ.4,000 వరకు ధర లభిస్తోందని, ఉత్పత్తుల వైవిధ్యీకరణ, నాణ్యత, డిజైన్ అభివృద్ధితో ఆదాయాన్ని మరింత పెంచే అవకాశం ఉందని తెలిపారు.
చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందిస్తూ చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేయాలని కమిషనర్ రేఖా రాణి సూచించారు.
Prajavartha Online Telugu News