-త్రిదండి చిన్న జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో బస్సు సేవలు ప్రారంభం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
విజయకీలాద్రి దివ్యక్షేత్రాన్ని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం కొండపైకి రాకపోకలు సాగించేందుకు నూతన బస్సు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో బుధవారం విజయకీలాద్రి క్షేత్రంలో నూతన బస్సును ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు, ఆలయ అర్చక బృందం పాల్గొని బస్సు సేవలను ప్రారంభించారు. కొండపై కొలువైన దివ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రయాణ ఇబ్బందులు లేకుండా మరింత సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నూతన బస్సును ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ బస్సు సేవలతో భక్తులకు కొండపైకి చేరుకోవడం మరింత సులభతరం కానుంది.
