మురసు తుఫాన్, భారీ వర్షాల నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి…

-పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని డ్రైన్లు, కాలువల ద్వారా వెంటనే బయటకు పంపించాలి.
-వరద ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి.
-జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
మురసు తుఫాన్, భారీ వర్షాల నేపథ్యంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, పలువురు చీఫ్ ఇంజనీర్లు (సీఈలు), సూపరింటెండింగ్ ఇంజనీర్లు (ఎస్‌ఈలు) ఈ టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

మురసు తుఫాన్ ప్రభావంతో పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని మంత్రి నిమ్మల తెలిపారు. పర్చూరు, బాపట్ల, చీరాల, ప్రత్తిపాడు ప్రాంతాల్లో నల్లమడ, పర్చూరు డ్రైన్లు గరిష్ట నీటిమట్టానికి మించి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

భారీ వర్షాల కారణంగా పంట పొలాల్లో నిలిచిన నీటిని కెనాల్స్, డ్రైన్ల ద్వారా వెంటనే బయటకు పంపించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

బుడమేరు, ఎర్రకాలువ, గోనెలవాగు, తమ్మిలేరు, ఏలేరు నదులు, వాగులు, రిజర్వాయర్లకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహాలపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వాగుల నుంచి ప్రకాశం బ్యారేజీకి 71 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని మంత్రి తెలిపారు. బుడమేరు క్యాచ్‌మెంట్ ప్రాంతంలో కురిసిన వర్షపు నీటిని బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణా నదిలోకి తరలిస్తున్నామని వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని నిరంతరం గమనిస్తూ పటిష్టమైన ఫ్లడ్ మేనేజ్‌మెంట్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

గత రెండు రోజులుగా విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎనికేపాడు అండర్ టన్నెల్ (యూటీ) నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి తరలిస్తున్నామని తెలిపారు.

ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.