గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

-నీట మునిగిన ప్రాంతాల్లో తక్షణమే నీటి తొలగింపునకు ఆదేశాలు
-కరువు పరిస్థితులపై కేంద్ర బృందంతో భేటీ.. ఏపీకి అన్ని విధాలా సాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:

రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో తక్షణమే నీటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. కరంచేడు, కొత్తపట్నం, చీరాల, చిలకలూరిపేట, పర్చూరు ప్రాంతాల్లో నీటి నిల్వలను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అనంతరం ఆర్టీజీఎస్‌లో నిర్వహించిన సమీక్షలో రహదారులపై రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ఏలూరు జిల్లాలోని బుట్టాయగూడెం, వేలేరుపాడు, పోలవరం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం తదితర గిరిజన ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కొన్ని ప్రాంతాల్లో చిన్న నీటిపారుదల చెరువులు పొంగిపొర్లుతున్నట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ తెలిపారు.

కేంద్ర బృందంతో చంద్రబాబు భేటీ

మరోవైపు రాష్ట్రంలోని కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు పర్యటించిన కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల బృందం బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. నవంబరు 2, 3 తేదీల్లో రెండు బృందాలుగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పర్యటించిన అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన వివరాలను ముఖ్యమంత్రికి వెల్లడించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తీరాంధ్ర ప్రాంతం తుపాన్ల ప్రభావాన్ని ఎదుర్కొంటుండగా, రాయలసీమతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వర్షాభావం, ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ ఏడాది సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదవడంతో ఖరీఫ్ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు. ముఖ్యంగా రాయలసీమలో సాగునీరు, తాగునీరు, పశుగ్రాసం కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దేశంలోనే రెండో అత్యల్ప వర్షపాతం అనంతపురం జిల్లాలో నమోదైందని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్రంలో 21 జిల్లాల పరిధిలోని 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించామని, రైతులకు జరిగిన నష్టాలను అంచనా వేసి కేంద్ర సాయాన్ని కోరుతూ ఇప్పటికే నివేదిక సమర్పించామని ముఖ్యమంత్రి తెలిపారు. వారం రోజుల్లో కరువు పరిస్థితులపై మరింత సమగ్ర నివేదికను కేంద్రానికి పంపిస్తామని వెల్లడించారు.

ఉపాధి హామీ పనిదినాలు 200కు పెంచాలి

ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇందుకు క్షేత్రస్థాయిలో ఎక్కువ మంది సిబ్బంది అవసరమని తెలిపారు. ఈ నేపథ్యంలో వికసిత్ భారత్-జీ రామ్ జీ (VB-G RAM G) పథకం కింద కనీస పనిదినాలను 200 రోజులకు పెంచడంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలకు కూడా వాటిని వినియోగించుకునేందుకు అనుమతించాలని కేంద్ర బృందాన్ని కోరారు. దీనివల్ల వ్యవసాయ కూలీల కొరతను అధిగమించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అదనపు ఉపాధి అవకాశాలు కలుగుతాయని వివరించారు.

రైతులకు రుణాల రీషెడ్యూల్ చేయాలి

కరువు కారణంగా రైతుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, వ్యవసాయ రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితి లేకుండా పోయిందని ముఖ్యమంత్రి తెలిపారు. అర్హులైన కరువు బాధిత కుటుంబాలకు డ్రై రేషన్ కార్డులు మంజూరు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర బృందాన్ని కోరారు. తద్వారా కేంద్ర సహకారంతో నిత్యావసర వస్తువులను సబ్సిడీ ధరలకు అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రైతులకు ఊరట కల్పించేలా వ్యవసాయ రుణాల రీషెడ్యూల్‌తో పాటు ఇతర ఉపశమన చర్యలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

జలజీవన్ మిషన్‌కు కేంద్ర సహకారం కోరిన సీఎం

వర్షాభావంతో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోయాయని, పలు ప్రాంతాల్లో అదనంగా బోర్లు వేసినా ఆశించిన ఫలితాలు రావడం లేదని చంద్రబాబు వివరించారు. తాత్కాలికంగా తాగునీటిని సరఫరా చేయడంతో పాటు శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించాలని సూచించారు. జలజీవన్ మిషన్ (JJM) విస్తరణకు కేంద్రం సహకరించాలని, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల అభివృద్ధి, అనుసంధానం, సమర్థవంతమైన నీటి నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

పంటల బీమా పరిహారం త్వరగా అందించాలి

కరువు వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పంటల బీమా పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే బీమా క్లెయిమ్‌లను ఆలస్యం చేయకుండా పరిష్కరించి పరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో త్వరగా జమ చేసేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. సకాలంలో పరిహారం అందితే రైతులు ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడి తదుపరి పంటల సాగుకు సిద్ధమవుతారని వివరించారు. కరువు ప్రభావం వ్యవసాయంతో పాటు పశుసంపద, గ్రామీణ జీవనోపాధిపై కూడా పడుతున్నందున పశుగ్రాసం, తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

15 రోజుల్లో కేంద్రానికి నివేదిక

కేంద్ర బృందం కరువు ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాలను పరిశీలించడంతో పాటు రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంది. క్షేత్రస్థాయి పరిశీలనలు, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని 15 రోజుల్లో కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని బృందం సభ్యులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా ఏపీకి అందించాల్సిన సహాయంపై తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తీవ్ర కరువుతో ఇబ్బందులు పడుతుండగా, తీరాంధ్ర జిల్లాలు తుపాన్ల కారణంగా పంటలు, ఇతర రంగాల్లో నష్టాలను ఎదుర్కొన్నాయని చంద్రబాబు కేంద్ర బృందానికి వివరించారు. ఈ బహుళ ప్రకృతి విపత్తుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా స్పందించి ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.