విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“ప్రపంచవ్యాప్తంగా ఆధునిక యుగంలో గుండె జబ్బులు తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో గుండె సంబంధిత వ్యాధుల లక్షణాలు, ప్రమాద కారకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి” అని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జె. శ్రీమన్నారాయణ సూచించారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా వాసవ్య నర్సింగ్ హోమ్లో మంగళవారం డాక్టర్ సమరం అధ్యక్షతన నిర్వహించిన ఆరోగ్య సదస్సులో ఆయన “కార్డియో వాస్కులర్ డిసీజ్ – లక్షణాలు, ప్రమాద కారకాలు” అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, గుండె జబ్బులు కేవలం వృద్ధులకు మాత్రమే వస్తాయనే భావన సరైనది కాదని, యువతలో కూడా జీవనశైలి మార్పులు, అధిక బరువు, మధుమేహం, అధిక రక్తపోటు, పొగతాగడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగానే కనిపిస్తున్నాయని వివరించారు. అందువల్ల వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఛాతీలో నొప్పి లేదా బిగుతుగా అనిపించడం, ఛాతీలో భారంగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక చెమటలు పట్టడం, అకస్మాత్తుగా నీరసం రావడం, తల తిరగడం, దవడ, భుజం లేదా చేతికి నొప్పి వ్యాపించడం వంటి లక్షణాలను గుండె సంబంధిత సమస్యలకు హెచ్చరిక సంకేతాలుగా గుర్తించాలని తెలిపారు. ముఖ్యంగా ఇటువంటి లక్షణాలు అకస్మాత్తుగా కనిపించినప్పుడు ఇంటి వద్దే ఉండి ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం పొందాలని చెప్పారు. గుండె జబ్బులకు దారితీసే ప్రధాన ప్రమాద కారకాలలో అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక బరువు, ధూమపానం, పొగాకు వినియోగం, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక వ్యాయామం లేకపోవడం, అధిక మానసిక ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ముఖ్యమైనవని వివరించారు. వీటిలో అనేక ప్రమాద కారకాలను జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా నియంత్రించవచ్చని తెలిపారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజూ క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, సంపూర్ణ ధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, ఉప్పు మరియు అధిక కొవ్వు పదార్థాలను తగ్గించడం, పొగాకు మరియు ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండడం, శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం అవసరమన్నారు. అలాగే రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ వంటి వాటిని క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలని సూచించారు. సదస్సులో అనేకమంది అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సందేహ నివృత్తి చేసారు. ఈ కార్యక్రమం సమరం గోపరాజు ఫేస్‌బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడగా, రేపటి నుండి సమరం హెల్త్ ఛానల్లో పూర్తి వీడియో అందుబాటులో ఉంటుందని డాక్టర్ సమరం తెలియచేసారు.
Prajavartha Online Telugu News