-రూ.100 కోట్ల డిపాజిట్లు, లక్ష సభ్యత్వమే లక్ష్యంగా…..
-18–60 ఏళ్ల సభ్యులకు రూ.50 వేల ఇన్సూరెన్స్ రక్షణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని మరింత బలోపేతం చేసి, ప్రతి సభ్యుడికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ తెలిపారు. గొల్లపూడిలోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో సొసైటీ ప్రతినిధులు, అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో సొసైటీ ప్రగతి, సభ్యుల సంక్షేమం, భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో, మంత్రి నారా లోకేష్ సమన్వయంతో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని చైర్మన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాల ద్వారా సుమారు రూ.140 కోట్ల మేర ప్రయోజనాలను అర్హులకు అందించినట్లు పేర్కొన్నారు.
సొసైటీలో ప్రస్తుతం సుమారు 82 వేల మంది సభ్యులు ఉన్నారని, గతంలో రూ.32 కోట్లుగా ఉన్న డిపాజిట్లు ప్రస్తుతం రూ.79.64 కోట్లకు, షేర్ క్యాపిటల్ రూ.45.63 కోట్లకు చేరడం సభ్యుల నమ్మకానికి నిదర్శనమన్నారు. త్వరలో లక్ష మంది సభ్యులు, రూ.100 కోట్ల డిపాజిట్లు సాధించే లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త బ్రాంచీల ఏర్పాటును పరిశీలించాలని, సభ్యుల అవసరాలకు అనుగుణంగా కొత్త రుణ పథకాలను రూపొందించాలని, రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
సభ్యుల కుటుంబాలకు ఆపద సమయంలో ఆర్థికంగా అండగా నిలిచేందుకు 18 నుంచి 60 సంవత్సరాల లోపు అర్హత కలిగిన సభ్యులకు రూ.50 వేల ఇన్సూరెన్స్ రక్షణ కల్పిస్తున్నామని చైర్మన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల్లో సుమారు 40 మంది సభ్యులకు రూ.18.20 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్లు పరిష్కరించగా, ఇప్పటివరకు సుమారు 227 మంది సభ్యులకు రూ.63.20 లక్షల మేర ఇన్సూరెన్స్ ప్రయోజనం అందినట్లు వివరించారు.
పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఆపద సమయంలో అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం *‘గరుడ దహన సంస్కారాల పథకం’*ను ప్రకటించిందని చైర్మన్ తెలిపారు. దహన సంస్కారాల సమయంలో అవసరమైన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా ఈ పథకం ద్వారా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే అకాల మరణం చెందిన సభ్యుల కుటుంబాలపై రుణభారం పడకుండా బెనెవలెంట్ ఫండ్ ద్వారా రుణ బకాయిలను పరిష్కరిస్తున్నామని, ఇటీవల 11 మంది సభ్యులకు సంబంధించి సుమారు రూ.5.14 లక్షల రుణ బకాయిలను పరిష్కరించినట్లు తెలిపారు.
సొసైటీ సభ్యులకు రావాల్సిన డివిడెండ్ను పారదర్శకంగా చెల్లించామని చైర్మన్ తెలిపారు. 2017 నుంచి 2022 వరకు అర్హత కలిగిన సభ్యులకు సంబంధించిన డివిడెండ్ ఇప్పటికే చెల్లించామని, గత సంవత్సరాల్లో 17 నుంచి 22 శాతం వరకు డివిడెండ్ ప్రకటించినట్లు చెప్పారు. మొదటి దశలో సేవింగ్ ఖాతా వివరాలు అందుబాటులో ఉన్న సుమారు 12 వేల మంది సభ్యుల ఖాతాల్లో నేరుగా డివిడెండ్ జమ చేశామని, రూ.500కు పైగా షేర్ క్యాపిటల్ కలిగి ఉండి రుణాలు తీసుకున్న సుమారు 1,500 మంది సభ్యులకు డివిడెండ్ వివరాలను మెసేజ్ల ద్వారా తెలియజేశామని తెలిపారు.
బ్రాహ్మణ కుటుంబాలు స్వయం ఉపాధి, వ్యాపారాల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావడానికి ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ప్రైజ్’ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని చైర్మన్ సూచించారు. కనీసం వెయ్యి బ్రాహ్మణ కుటుంబాలు సొంత వ్యాపారాలను ప్రారంభించేలా అవసరమైన ఆర్థిక సహాయం, రుణ సదుపాయాలు, మార్గదర్శకత్వం అందించే దిశగా కృషి చేయాలని తెలిపారు.
“ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో, మంత్రి నారా లోకేష్ సమన్వయంతో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమానికి అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి బ్రాహ్మణ కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా పనిచేయడం మా బాధ్యత” అని చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పేర్కొన్నారు.
“సొసైటీ అభివృద్ధి అంటే కేవలం డిపాజిట్లు, సభ్యత్వం, బ్రాంచీల పెంపు మాత్రమే కాదు. ప్రతి సభ్యుడికి ఆర్థిక భద్రత కల్పించడం, ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలవడం, రుణ సదుపాయాలు అందించడం, రూ.50 వేల ఇన్సూరెన్స్ రక్షణ కల్పించడం, డివిడెండ్ను పారదర్శకంగా చెల్లించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సభ్యులకు చేరవేయడం కూడా మన బాధ్యత” అని ఆయన అన్నారు.
సభ్యులు, డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ సొసైటీని మరింత బలోపేతం చేసి లక్ష సభ్యత్వం, రూ.100 కోట్ల డిపాజిట్ల లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలని చైర్మన్ పిలుపునిచ్చారు. సభ్యుల నమ్మకం, పారదర్శకత, ఆర్థిక భద్రత, సంక్షేమం అనే నాలుగు అంశాలను ప్రధానంగా తీసుకుని బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు.
Prajavartha Online Telugu News