-పట్టణాల్లో తాగునీటి సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు
-ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిరంతర ప్రక్రియగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. క్యాంప్ కార్యాలయంలో బుధవారం వివిధ శాఖలు అందించే సేవలపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ, అన్నక్యాంటీన్లు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం, సంక్షేమ హాస్టళ్లల్లో వసతులు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు కెపాసిటీ బిల్డింగ్, నైపుణ్య శిక్షణలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ అగ్ర స్థానంలో ఉందని సీఎం చెప్పారు. ఐగాట్ కర్మ యోగి ద్వారా వివిధ కోర్సుల్లో శిక్షణ ఇప్పించామని… రియల్ టైమ్లో పని చేసేలా ఉద్యోగులు శిక్షణ పొందుతున్నారన్నారు. వివిధ వర్చువల్ కోర్సుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఐఏఎస్ అధికారులు ఎప్పటికప్పుడు ఓరియేంటేషన్ తీసుకుంటూ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటారో… అదే తరహాలో ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధి ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగులకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ ఇప్పించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక తాగునీటి సమస్యను నివారించే విషయంలో ఎంత మాత్రం నిర్లక్ష్యం వహించొద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమీక్ష సందర్భంగా పట్టణాల్లో తాగునీటి సరఫరా ఎలా ఉందని అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో వర్షాలు పడడంతో పట్టణాల్లో తాగునీటి సమస్య చాలా వరకు తగ్గిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రాయలసీమలో రెండు మున్సిపాల్టీల్లో కొద్దిపాటి తాగునీటి సమస్య ఉందని.. దాన్ని అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక విశాఖ నగరంలో కూడా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయిందని.. తాగునీటి సమస్యను అధిగమిస్తున్నామని అధికారులు వివరించారు. పట్టణాల్లో కానీ.. పల్లెల్లో కానీ తాగునీటి సమస్య ఉత్పన్నం కాకూడదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాలు పడ్డాయని నిర్లక్ష్యంతో ఉండొద్దని సూచించారు. ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వాములను చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News