Breaking News

అగ్ని ప్రమాద సమయంలో అప్రమత్తతే ప్రాణ రక్షణకు కీలకం

-విద్యార్థులకు అవగాహన కల్పించిన వీఎంసీ ఫైర్ సిబ్బంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ ఫార్మాసిటికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన పనులు, చేయకూడని పనులపై వీఎంసీ ఫైర్ సిబ్బంది ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్ఎఫ్ఓ సిహెచ్. రత్నబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాద సమయంలో విద్యార్థులు ఎలా అప్రమత్తంగా వ్యవహరించాలి, సురక్షితంగా బయటకు ఎలా రావాలి అనే అంశాలను వివరించారు.

ఈ సందర్భంగా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు విద్యార్థులు భయాందోళనలకు గురికాకుండా తాము ఉన్న ఫ్లోర్ నుంచి కేవలం మెట్ల మార్గం ద్వారా మాత్రమే కిందకు రావాలని సూచించారు. కిందకు వచ్చిన అనంతరం ఎక్కడపడితే అక్కడికి పరుగులు తీయకుండా అందరూ ఒక నిర్దేశిత సేఫ్ అసెంబ్లీ పాయింట్ వద్దకు చేరుకోవాలని తెలిపారు. ఇలా ఒకే ప్రాంతంలో అందరూ చేరినప్పుడు ఎంత మంది సురక్షితంగా బయటకు వచ్చారు, ఇంకా ఎంత మంది లోపల ఉన్నారనే విషయాన్ని సులభంగా అంచనా వేసి, లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.

అగ్ని ప్రమాద సమయంలో భయాందోళనలకు గురై విద్యార్థులు వివిధ ప్రాంతాలకు వెళ్లిపోతే ఎంత మంది బయటకు వచ్చారు, ఎంత మంది ఇంకా లోపల ఉన్నారనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తించడం కష్టమవుతుందని తెలిపారు. అందువల్ల ప్రమాద సమయంలో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, సమన్వయంతో వ్యవహరించడం ఎంతో ముఖ్యమని సూచించారు.

అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు సమీపంలో ఉన్న అగ్నిమాపక పరికరాలను ఎలా వినియోగించాలి, గదిలో పూర్తిగా పొగ వ్యాపించినప్పుడు నేలకు దగ్గరగా పాకుతూ సురక్షితంగా ఎలా బయటకు రావాలి, లిఫ్ట్‌ను ఎందుకు ఉపయోగించకూడదు, మెట్ల మార్గం ద్వారానే ఎందుకు బయటకు రావాలి, అగ్ని ప్రమాద సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు వంటి అంశాలపై విద్యార్థులకు ఫైర్ సిబ్బంది వివరాత్మకంగా అవగాహన కల్పించారు.

అనంతరం విద్యార్థులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించే విధంగా మాక్ డ్రిల్ నిర్వహించి, అగ్ని ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలను ప్రదర్శించారు. విద్యార్థులు కూడా మాక్ డ్రిల్‌లో పాల్గొని అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా బయటపడే విధానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ మాల్యాద్రి, ఎస్ఎఫ్ఓ నరేష్, వీఎంసీ ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

-డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేదలకు వందల రెట్ల లబ్ది -ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *