-ప్రజలకు తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం తన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ప్రకాశం బ్యారేజ్, సీతమ్మవారి పాదాలు, తుమ్మలపల్లి కళాక్షేత్రం, పాత ప్రభుత్వ ఆసుపత్రి, అజిత్‌సింగ్ నగర్, డాబాకోట్లు, మాకినేని బసవపున్నయ్య స్టేడియం తదితర ప్రాంతాలను సందర్శించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అంగరంగ వైభవంగా నిర్వహించనున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రజలకు తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు, మరుగుదొడ్లను పరిశుభ్రంగా, వినియోగానికి అనువుగా ఉంచాలని సూచించారు.
తాగునీటి పాయింట్ల వద్ద నిరంతరం నీటి సరఫరా ఉండేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, మరుగుదొడ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ పి. సత్యకుమారి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్. నిర్మల గ్లోరీ, డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్) చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మురళి గౌడ్, రీజినల్ ఫైర్ ఆఫీసర్ సిహెచ్. రత్నబాబు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి. అన్నపూర్ణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News