విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవజీవన్ బాల భవన్ ఆధ్వర్యంలో విజయవాడ కేదారేశ్వర పేట లోని అంగన్వాడీ సెంటర్లో మూడోవ సెక్టార్‌కు చెందిన అంగన్వాడీ కార్యకర్తల కు మాదకద్రవ్యాలు మరియు సోషల్ మీడియా దుర్వినియోగ పై వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు .
ఈ కార్యక్రమము లో నవజీవన్ బాల భవన్ ప్రోగ్రాం మేనేజర్ గోళ్ళమూడి శేఖర్ బాబు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, విద్య, ఆరోగ్యం, కుటుంబ జీవితం మరియు సామాజిక సంబంధాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసైన యువత నేరాల వైపు మళ్లే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తేనే వ్యసనాల నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
అలాగే సోషల్ మీడియా అధిక వినియోగం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు, ఆన్లైన్ గేమింగ్ వ్యసనం, సైబర్ వ్యసనాలు, పోర్నోగ్రఫీ, ఆన్లైన్ జూదం వంటి ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. చిన్నారులు, యువతలో కనిపించే ప్రవర్తనా మార్పులను ముందుగానే గుర్తించి తగిన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు.
నీతోడు మానసిక వికాస కేంద్రం జోనల్ కోఆర్డినేటర్ P విజయ్ కుమార్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు మరియు సోషల్ మీడియా వ్యసనాలతో బాధపడుతున్న విద్యార్థులు, యువత కోసం నూజివీడు లో బోస్కో డీ-అడిక్షన్ సెంటర్ మరియు విజయవాడ పెజ్జోనిపేటలోని నీతోడు మానసిక వికాస కేంద్రం ద్వారా ఉచిత కౌన్సెలింగ్, చికిత్స సేవలు అందిస్తున్నామని తెలిపారు. సహాయం అవసరమైన వారు 94904 92020 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
మూడోవ సెక్టార్ అంగన్వాడీ సూపర్వైజర్ దుర్గా భవాని మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తలకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వ్యసనాల నివారణకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో నీతోడు మానసిక వికాస కేంద్రం జోనల్ కోఆర్డినేటర్ N దేవమణి, కేదారేశ్వర పేట సెక్టార్‌కు చెందిన అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News