-జర్నలిస్టుల భద్రత, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, హత్యలు, వేధింపుల కేసుల పరిశీలనతో పాటు జర్నలిస్టుల భద్రత, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఈ దిశగా హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం జి.ఓ. జారీ చేసింది.
జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. జర్నలిస్టులకు అవసరమైన మీడియా అక్రిడిటేషన్లు, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలను పునరుద్ధరించింది.
2016 లో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కీలకంగా పనిచేసింది. జర్నలిస్టుల భద్రత, సంక్షేమానికి సంబంధించిన పలు సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలిపోయాయని జర్నలిస్టు సంఘాలు పేర్కొంటున్నాయి. జర్నలిస్టులపై జరిగిన దాడులు, హత్యలు, వేధింపుల ఘటనల్లో బాధితులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జర్నలిస్టు సంఘాలు పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చాయి.
ఫోర్త్ ఎస్టేట్‌గా భావించే జర్నలిజం స్వేచ్ఛను, విలువలను పరిరక్షించడంతో పాటు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చించి జర్నలిస్టుల హైపవర్ కమిటీ ఏర్పాటుపై చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన జి.ఓ.ను విడుదల చేసింది.
హైపవర్ కమిటీ ఏర్పాటు ఇలా..
* రాష్ట్ర హోంశాఖ మంత్రి – చైర్మన్
* సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి – వైస్ చైర్మన్
* హోం, సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖల ముఖ్య కార్యదర్శులు, ఎక్స్-అఫీషియో సెక్రటరీ, సాధారణ పరిపాలన (I&PR) శాఖ, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్).
* జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు – సభ్యులు
* సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ మెంబర్ కన్వీనర్
ఈ కమిటీ జర్నలిస్టులపై జరిగే దాడులు, హత్యలు, వేధింపులు తదితర అంశాలను పరిశీలించి, బాధిత జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చర్యలకు సిఫార్సులు చేయడంతో పాటు జర్నలిస్టుల భద్రత, సంక్షేమానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి దోహదపడనుంది.
హైపవర్ కమిటీ ఏర్పాటు పట్ల రాష్ట్రంలోని జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. జర్నలిస్టుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ కమిటీని ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు, సమాచార,పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారధికి జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు..
Prajavartha Online Telugu News