39వ డివిజన్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కార్పొరేటర్ తిరుపతి అనూష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
39వ డివిజన్‌లో కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తిరుపతి అనూష కార్పొరేటర్‌గా విజయం సాధించిన సందర్భంగా డివిజన్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె 39వ డివిజన్ పరిధిలోని ప్రతి గడపకు వెళ్లి స్థానిక ప్రజలను కలిసి తనను ఆదరించి, అఖండ మెజార్టీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని, వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించి, డివిజన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తన విజయానికి సహకరించి, కృతజ్ఞత కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలందరికీ తిరుపతి అనూష ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.