విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
“వయస్సు పెరిగే కొద్దీ ఎంత ఆరోగ్యంగా, చురుకుగా జీవించాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. కదలకుండా ఉండటమే శరీరానికి పెద్ద శత్రువు. ప్రతిరోజూ కదలండి, ఆరోగ్యంగా ఉండండి, ఇతరులపై ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో జీవించండి” అని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఓలోస్ గోరా పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోం లో శుక్రవారం డాక్టర్ సమరం అధ్యక్షతన జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన “వృద్ధాప్యంలో ఫిజియోథెరపీ ఆవశ్యకత” అనే అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ సరైన వ్యాయామం, నడక, సమతుల్య ఆహారం, తగినంత విశ్రాంతి, సానుకూల దృక్పథంతో వయస్సు పెరిగినా ఆరోగ్యంగా, స్వతంత్రంగా జీవించవచ్చని వివరించారు. నేటి జీవనశైలిలో శారీరక శ్రమ గణనీయంగా తగ్గిపోవడం వల్ల చిన్న వయస్సులోనే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో కండరాల బలం తగ్గడం, ఎముకల పటుత్వం క్షీణించడం, కీళ్ల నొప్పులు, నడకలో అస్థిరత, శరీర సమతుల్యత లోపించడం వంటి సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. వీటిని నివారించడానికి శారీరక కదలికలు ఎంతో అవసరమని చెప్పారు. ప్రతిరోజూ తమ శారీరక సామర్థ్యానికి అనుగుణంగా నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా రక్తపోటు, మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలను నియంత్రించుకోవచ్చని వివరించారు. వయస్సు పెరిగే కొద్దీ కండరాల బలం తగ్గకుండా ఉండేందుకు తగిన బలవర్ధక వ్యాయామాలు చేయాలని సూచించారు. కుర్చీలో కూర్చొని లేవడం, చేతులు పైకి ఎత్తడం, తేలికపాటి బరువులతో వ్యాయామం చేయడం వంటి సాధారణ కదలికలు కూడా ఎంతో ప్రయోజనకరమని తెలిపారు.
వృద్ధుల్లో ప్రమాదవశాత్తు పడిపోవడం వల్ల ఎముకలు విరగడం, దీర్ఘకాలిక అంగవైకల్యం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అందువల్ల శరీర సమతుల్యతను పెంపొందించే వ్యాయామాలు, సరైన నడక పద్ధతులు అలవాటు చేసుకోవాలని వివరించారు. అవసరమైతే ఫిజియోథెరపిస్ట్ సూచనలతో వ్యాయామాలు చేయాలని తెలిపారు. మెడ, భుజాలు, చేతులు, నడుము, మోకాళ్లు, చీలమండల కీళ్లను తగినంత కదిలిస్తూ ఉండటం వల్ల వాటి కదలిక సామర్థ్యం మెరుగుపడుతుందని చెప్పారు. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి నడవడం, తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. శారీరక వ్యాయామం కేవలం శరీరానికే కాకుండా మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి, మానసిక ఉల్లాసానికి కూడా తోడ్పడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వయస్సు, ఆరోగ్య పరిస్థితి, శారీరక సామర్థ్యానికి అనుగుణంగా వ్యాయామాలను ఎంచుకోవాలని, గుండె సంబంధిత సమస్యలు, తీవ్రమైన కీళ్ల నొప్పులు లేదా ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతో వ్యాయామాలు ప్రారంభించాలని సూచించారు. డి.రవికుమార్ వందన సమర్పణ చేసారు. సదస్సులో పాల్గొన్న పలువురు అనేక ప్రశ్నలడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు.
చురుకైన జీవనశైలితో ఆరోగ్యకరమైన వృద్ధాప్యం
